Mock Drill: 54 ఏళ్ల తర్వాత దేశవ్యాప్తంగా మాక్‌డ్రిల్స్.. యుద్ధ సన్నద్ధతపై ప్రజలకు అవగాహన..

Written by RAJU

Published on:

దేశవ్యాప్తంగా మాక్‌డ్రిల్స్ జరిగాయి. ఆపరేషన్‌ అభ్యాస్‌ పేరుతో దేశంలో మొత్తం 244 చోట్ల సివిల్‌ డిఫెన్స్‌ మాక్‌ డ్రిల్స్‌ నిర్వహించారు. 54 ఏళ్ల తర్వాత భారత్‌ తొలిసారి యుద్ధ సన్నద్ధతపై మాక్‌ డ్రిల్స్‌ చేపట్టింది. హైదరాబాద్‌లో 4 చోట్ల సివిల్‌ డిఫెన్స్‌ మాక్‌ డ్రిల్స్‌ నిర్వహించారు. సికింద్రాబాద్, గోల్కొండ, కంచన్‌బాగ్‌ DRDA, మౌలాలి NFCలో మాక్ డ్రిల్స్‌ కొనసాగాయి. అత్యవసర పరిస్థితుల్లో ఎలా వ్యవహరించాలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు అధికారులు.. పోలీసులు, ఫైర్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌, వైద్య, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

ఇక విశాఖలో రెండు చోట్ల సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ జరిగింది. నేవీ, కోస్ట్‌ గార్డ్‌, ఆర్మీ అధికారులు ఇందులో పాల్గొన్నారు.



ఎయిర్‌ రెయిడ్‌ సైరన్‌ వినిపించగానే బహిరంగ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లడం.. ఇళ్లలో ఎలక్ట్రికల్‌ పరికరాలు, లైట్లు, స్టవ్‌లు ఆపేసి, చెవులు గట్టిగా మూసుకుని సురక్షిత స్థానాల్లో తల దాచుకోవడంలాంటి వాటిపై అవగాహన కల్పించారు అధికారులు.

ఈ సివిల్‌ డిఫెన్స్‌ మాక్‌ డ్రిల్స్‌లో సైరన్‌ అత్యంత కీలకమైంది. దీనిద్వారా గగనతల దాడుల హెచ్చరిక వ్యవస్థల సామర్థ్యాన్ని అంచనా వేస్తారు. వాయుసేనతో హాట్‌లైన్‌, రేడియో కమ్యూనికేషన్‌ను వినియోగంలోకి తెచ్చేందుకు, కంట్రోల్‌ రూమ్‌లు, షాడో కంట్రోల్‌ రూమ్‌ల పనితీరును పరీక్షించేందుకు ఉపయోగిస్తారు.

1971లో భారత్‌-పాక్.. అంతకుముందు 1962లో భారత్ -చైనా మధ్య యుద్ధ సమయంలో మాక్‌డ్రిల్ నిర్వహించారు. మళ్లీ 54ఏళ్ల తర్వాత దేశవ్యాప్తంగా మాక్‌డ్రిల్స్ జరుగుతున్నాయి. మాక్‌డ్రిల్‌తో ప్రజలెవరూ ఆందోళన చెందొద్దని సూచించారు పోలీసులు. స్కైలాబ్‌ సమయంలో లేనిపోని అపోహలతో ప్రజలు భయపడ్డారని గుర్తు చేస్తున్నారు. కేవలం అవగాహన కోసమే మాక్‌ డ్రిల్స్‌ జరుగుతున్నాయన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights