అమ్మాయిలు బీ కేర్‌ఫుల్. ఇది మాయగాళ్ల లోకం. నమ్మితే మిమ్మల్ని ఏ రకంగా ముంచుతారో అస్సలు ఊహించలేరు. కొంతమంది గురించి మీరు బయటకు చెప్పుకోడానికి కూడా నామోషీగా ఉంటుంది. తాజాగా విజయవాడలో మాయమాటలతో ఓ యువతిని బురిడీ కొట్టించాడు ఓ కేటుగాడు. యువతిని ఏకాంతంగా గడుపుదామంటూ ఓ హోటల్ రూమ్‌కి పిలిపించాడు. ఆపై దుస్తులు విప్పించి.. నగలతో పరారయ్యాడు. బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ కేసుపై దర్యాప్తు సాగుతోంది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే… బెజవాడకు చెందిన యువతికి ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ యువకుడు నెల రోజుల క్రితం పరిచయం అయ్యాడు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య చాట్ నడిచింది. మత్తైన మాటలు చెబుతూ ఆమెను తన దారికి తెచ్చుకున్నాడు. ఈ క్రమంలో ఏకాంతంగా గడుపుదాం రమ్మని అడుగుతూ.. ఆమె బంగారానికి స్కెచ్ గీశాడు. చనువుగా మాట్లాడి ఆమెను ట్రాప్ చేసి.. మంగళవారం సాయంత్రం మాచవరంలో గల ఓ హోటల్‌కి రమ్మన్నాడు.
హోటల్‌లోకి వెళ్లగానే.. రొమాన్స్ చేస్తున్నట్లుగా యువతి దుస్తులు తొలగించి.. క్షణాల వ్యవధిలో వాటితోనే ఆమె కాళ్లు, చేతులు కట్టిపడేశాడు. ఆపై యువతి ఒంటిపై ఉన్న సుమారు 20 గ్రాముల గోల్డ్ చైన్ తీసుకొని హోటల్ నుంచి వెళ్లిపోయాడు. కొంత సమయానికి ఎలాగోలా కట్లు విప్పుకున్న యువతి.. హోటల్ నిర్వాహకుల సహకారంతో మాచవరం పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే, సదరు యువకుడు తన వివరాలు బయటకు రాకుండా పక్కాగా ప్లాన్ చేసుకున్నాడు. తన ఫోన్ నెంబర్ కానీ ఇతర వివరాలు కానీ చెప్పకుండా ఇన్‌స్టాగ్రామ్ ఎంచుకుని అమ్మాయికి వల వేసినట్లు పోలీసులు చెబుతున్నారకు. కాగా, ఇన్‌స్టాగ్రామ్ ఐడీ, సెల్‌ఫోన్ లొకేషన్, సీసీ టీవీల విజువల్స్ సాయంతో నిందితుడి కోసం గాలిస్తున్నామని మాచవరం పోలీసులు తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..