దేశ దిశ

Uttam Kumar Reddy: తుమ్మిడిహెట్టి బ్యారేజీని నిర్మించాలి


ABN
, Publish Date – Apr 11 , 2025 | 05:05 AM

ప్రాణహిత-చేవెళ్ల ఎత్తిపోతల పథకంలో భాగంగా తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణం చేపట్టాలని ప్రజాప్రతినిధులు ప్రభుత్వాన్ని కోరారు. మంత్రికి వినతిపత్రం అందించిన ఎమ్మెల్యే హరీశ్‌ బాబు, ఎమ్మెల్సీ కోదండరాం, నైనాల గోవర్ధన్‌ వంటి నాయకులు ఈ బ్యారేజీ నిర్మాణానికి అవసరమైన అనుమతులను సాధించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు

 Uttam Kumar Reddy: తుమ్మిడిహెట్టి బ్యారేజీని నిర్మించాలి

  • మంత్రి ఉత్తమ్‌ను కలిసిన కోదండరాం

  • పాల్వాయి హరీశ్‌, నైనాల గోవర్ధన్‌

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 10 (ఆంధ్రజ్యోతి): ప్రాణహిత-చేవెళ్ల ఎత్తిపోతల పథకంలో భాగంగా తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణం చేపట్టాలని పలువురు ప్రజాప్రతినిధులు ప్రభుత్వాన్ని కోరారు. గురువారం నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని సిర్పూర్‌-కాగజ్‌నగర్‌ బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌ బాబు, ఎమ్మెల్సీ కోదండరాం, తెలంగాణ జలసాధన సమితి కన్వీనర్‌ నైనాల గోవర్ధన్‌, ప్రాణహిత పరిరక్షణ వేదిక కన్వీనర్‌ కె.వి.ప్రతా్‌ప కలిసి వినతిపత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీని పునరుద్ధరించడం అసాధ్యమని, ఒకవేళ బ్యారేజీని పునరుద్ధరించినా.. మళ్లీ మన్నిక ఉంటుందనే గ్యారెంటీ లేదని పేర్కొన్నారు. మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు కుంగే అవకాశాలు లేకపోలేదన్నారు. ఎన్నికల ముందు కాంగ్రెస్‌ చేసిన వాగ్ధానానికి అనుగుణంగా తుమ్మిడిహెట్టి బ్యారేజీని నిర్మించాలని, ఇంకా అంశాలను ప్రస్తావిస్తూ వారు మంత్రికి విజ్ఞప్తి చేశారు. ఇక తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణం కోసం అనుమతులు సాధించే బాధ్యత తనదేనని, రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళితే ప్రధానమంత్రి కృషి సింఛాయ్‌ యోజన కింద 60% నిధులు వచ్చేలా చొరవ తీసుకుంటానని బీజేపీ ఎమ్మెల్యే హరీశ్‌బాబు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్‌ మాట్లాడుతూ.. తుమ్మిడిహెట్టి పూర్తి చేయడానికి వీలుగా ప్రాణహిత-చేవెళ్ల కార్పొరేషన్‌ ఒకటి ఏర్పాటు చేయాల్సి ఉందని చెప్పారు.

Updated Date – Apr 11 , 2025 | 05:06 AM

Exit mobile version