హైదరాబాద్, ఏప్రిల్ 28: రాష్ట్ర నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ మరో గుడ్ న్యూస్ చెప్పనుంది. త్వరలోనే పోలీసు శాఖలో భారీ ఎత్తున ఉద్యోగ నియామకాలకు సన్నాహాలు చేస్తుంది. పోలీస్ విభాగంలో దాదాపు 12 వేల వరకు ఖాళీలు ఉంటాయని అంచనా. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందిన వెంటనే ప్రతిపాదనలు పంపేందుకు బోర్డు అధికారులు సిద్ధంగా ఉన్నారు. గత కొంతకాలంగా పోలీసుశాఖలో భారీగా ఉద్యోగ నియామకాలు చేపడుతున్నా.. పదవీ విరమణ ద్వారా ఏర్పడుతున్న ఖాళీలనే భర్తీ చేస్తున్నారు. 2007లో లుంబినీపార్కు, గోకుల్‌చాట్ వద్ద బాంబు పేలుళ్లు జరిగాక పోలీసు శాఖను బలోపేతం చేయాలన్న ఉద్దేశంతో అప్పటి ప్రభుత్వం ఒకేసారి 35 వేల పోస్టులను భర్తీ చేయాలని భావించింది. కానీ ఒకేసారి ఇన్ని పోస్టులను భర్తీ చేయడం అసాధ్యం. అందుకే విడతలుగా పోలీస్ శాఖలో నియామకాలు చేపడుతున్నారు.
అయితే కొన్ని సకాలంలో భర్తీ చేసినా.. కొన్ని రిక్రూట్‌మెంట్‌లు మాత్రం వివిధ కారణాలతో వాయిదా పడుతున్నాయి. చివరిసారిగా తెలంగాణలో పోలీస్ నియామకాలు 2022 సంవత్సరంలో పూర్తి చేసింది. నాటి నోటిఫికేషన్‌లో మొత్తం17 వేల పోస్టులను తెలంగాణ రాష్ట్ర పోలీసు నియామక మండలి భర్తీ చేసింది. 2022లో చేపట్టిన నియామక ప్రక్రియలో ఎంపికై, శిక్షణ పూర్తి చేసుకున్న వారికి 2024లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నియామకపత్రాలు అందజేసిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది కూడా మరోసారి భారీ ఎత్తున పోలీస్ నియామకాల భర్తీకి అధికారులు సన్నద్ధం అవుతున్నారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం.. కానిస్టేబుల్, ఎస్సై స్థాయి పోస్టులు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 12 వేల వరకు ఖాళీగా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ పోస్టులు మరికాస్త పెరిగే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగుల ఉద్యోగ విరమణ వయసును 58 ఏళ్ల నుంచి 61 ఏళ్లకు పెంచుతూ 2021 ఏప్రిల్‌లో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో ఆ ఏడాది పదవీ విరమణ చేయాల్సి వారు 2024 మార్చి వరకు పొడిగించారు. 2024 ఏప్రిల్ నుంచి మళ్లీ ఉద్యోగ విరమణలు ప్రారంభమైనాయి. ఖాళీ అయిన పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తే.. వెంటనే నియామక ప్రారంభించేందుకు తెలంగాణ రాష్ట్ర పోలీసు నియామక మండలి కూడా సిద్ధంగా ఉంది.
ఇవి కూడా చదవండి
మరిన్ని విద్యా, ఉద్యగ వార్తల కోసం క్లిక్ చేయండి.