- జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో పర్యటకులపై దాడి
- 28 మంది మృతి చెందినట్లు సమాచారం
- ఈ దాడికి పాల్పడ్డ ముగ్గురు ఉగ్రవాదులు ఊహాచిత్రాలు

జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో మంగళవారం పర్యటకులపై దాడి జరిగిన విషయం తెలిసిందే. జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో పర్యటకులపై తీవ్రవాదులుగా భావిస్తున్న వారి దాడి జరిగింది. ఈ దాడిలో ఇప్పటి వరకు దాదాపు 28 మంది పర్యటకులు మరణించినట్లు తెలుస్తోంది. మీడియాలో కనిపిస్తున్న కొన్ని వీడియోలలో దుండగులు ముస్లిమేతరులను ప్రత్యేకంగా టార్గెట్ చేసుకుని దాడి చేశారని బాధితులు చెప్పడం కనిపించింది. ఈ దాడికి పాల్పడిన ఉగ్రవాదుల ఊహాచిత్రాలు బయటకు వచ్చాయి. ముగ్గురు ఉగ్రవాదులను ఆసిఫ్ ఫుజి, సులేమాన్ షా, అబు తల్హాగా గుర్తించారు. బాధితులు తెలిపిన వివరాలు, తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని భద్రతాదళాలు ఈ ఊహా చిత్రాను రూపొందించారు. వీరిని పట్టుకునేందుకు ముమ్మర గాలింపు చర్యలు సాగుతున్నాయి. ఈ ఉగ్రవాదులు కశ్మీర్‌ను విడిచి వెళ్లే అవకాశం లేదని, సమీప ప్రాంతంలోనే తలదాచుకున్నట్లు తెలుస్తోంది.ఈ దాడిలో కనీసం 5–6 మంది ఉగ్రవాదులు పాల్గొన్నట్లు సమాచారం.
READ MORE: Pahalgam Terror Attack : ఉగ్రదాడి నుంచి కొద్దిలో తప్పించుకున్న సెలబ్రిటీ జంట
కాగా.. పహల్గాంలోని బైసరన్‌లో ఉగ్రదాడి చేసి పర్యాటకులను పొట్టనబెట్టుకున్న ‘ద రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్‌ఎఫ్)’ కొత్తగా ఏర్పాటైందే. కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత ఏర్పడిందే. తొలుత ఆన్‌లైన్‌లో ఉగ్ర కార్యకలాపాలను నిర్వహించేది. ఆ తరువాత 6 నెలల్లోగా లష్కరే తోయిబా వంటి పలు ఉగ్ర సంస్థల సభ్యులను తీసుకుని భౌతిక గ్రూపుగా ఏర్పాటైంది. దీని వెనుక పాకిస్థాన్ ఉంది. పాకిస్థాన్‌కు చెందిన ఐఎస్‌ఐనే టీఆర్‌ఎఫ్‌ను సృష్టించిందని నిఘా వర్గాల సమాచారం. లష్కరే తోయిబా నుంచి ప్రపంచం దృష్టిని మళ్లించడానికి ఈ టీఆర్‌ఎఫ్‌ను ఏర్పాటు చేయించినట్లు చెబుతున్నారు. లష్కరే తోయిబా ఉగ్ర కార్యకలాపాల కారణంగా 2018లో నిషేధిత దేశాల జాబితాలో పాకిస్థాన్‌ను ఆర్థిక చర్యల టాస్క్‌ఫోర్స్ (ఎఫ్‌ఏటీఎఫ్) చేర్చింది.