
విశాఖలో విషాదం నెలకొంది. పహల్గామ్ దాడిలో ప్రాణాలు కోల్పోయిన విశాఖ వాసి చంద్రమౌళి కుటుంబం తల్లడిల్లిపోతుంది. ఆయనతో పాటు కశ్మీర్ వెళ్లిన స్నేహితులు అక్కడ జరిగిన ఘటనను తలచుకొని వణికిపోతున్నారు. పెహల్గామ్ మరణహోమాన్ని కళ్లారా చూశారు శశిధర్, అప్పన్న దంపతులు.. ఉగ్రవాదులు క్రూరంగా చంపేశారంటూ కన్నీరుమున్నీరయ్యారు. విశాఖ చేరుకున్న వారు టీవీ9 తో మాట్లాడారు.
ఉగ్రదాడిలో రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయి చంద్రమౌళి చనిపోవడంతో షాక్‌లో ఉన్నారు కుటుంబ సభ్యులు. నాలుగు రోజుల్లో అంతా తలకిందులైందని కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఈ నెల 18న ఇంటి నుంచి సంతోషంగా చంద్రమౌళి, ఆయన భార్య నాగమణి.. పదిరోజుల కశ్మీర్ పర్యటనకు వెళ్లారు.
ముగ్గురు స్నేహితులు.. వారి ఫ్యామిలీతో కలిసి కశ్మీర్ వెళ్లాక.. ఎంతో ఎంజాయ్ చేశారు. చంద్రమౌళి, అప్పన్న, శశిధర్ దంపతులు.. కశ్మీర్ అందాలను ఆస్వాదిస్తూ.. తమ జ్ఞాపకాలను ఫొటోల్లో బంధించారు. కేబుల్ కార్ ప్రయాణం, తులిప్ గార్డెన్స్‌లో విహారం, దాల్ లేఖ్‌లో పడవ ప్రయాణం అన్నీ ఎంతో ఆస్వాదించారు. చివరగా మినీ స్విట్జర్లాండ్‌గా పిలిచే పగల్గామ్‌కు వెళ్లారు. పిక్నిక్ స్పాట్‌కు వెళ్లేందుకు..రోడ్డు మార్గం సరిగ్గా లేకపోవడంతో కొంత దూరం వెళ్లాక వెనక్కి వచ్చేద్దామనుకున్నారు. కానీ.. చంద్రమౌళే.. వెళ్లి ఎంజాయ్ చేసి వద్దామని అందరినీ ప్రోత్సహించారని స్నేహితులు చెప్తున్నారు. అక్కడికి వెళ్లాక ఉగ్రదాడిని గుర్తు చేసుకుని ఇప్పటికీ వణికిపోతున్నారు.