దేశ దిశ

Maoist Crackdown: ఆపరేషన్‌ కర్రెగుట్టలు షురూ

Maoist Crackdown: ఆపరేషన్‌ కర్రెగుట్టలు షురూ

గుట్టలను చుట్టుముట్టిన బలగాలు.. ఉదయం నుంచి మొదలైన బాంబుల మోత

  • పూజారి కాంకేర్‌ రోడ్డు మూసివేత

  • ప్రజలు ఇళ్లలోనే ఉండాలని ఆదేశాలు

  • మందుపాతరలను గుర్తించి నిర్వీర్యం చేస్తున్న కేంద్ర బలగాలు

  • తెలంగాణ సరిహద్దు ప్రాంతాల దిగ్బంధం

  • కాల్పుల విరమణను ప్రకటించాలి

  • బలగాలను సీఎం వెనక్కి రప్పించాలి

  • పీస్‌ డైలాగ్‌ కమిటీ చైర్మన్‌ చంద్రకుమార్‌

చర్ల/వాజేడు/వెంకటాపురం/బర్కత్‌పుర, ఏప్రిల్‌ 23 (ఆంధ్రజ్యోతి): ఆపరేషన్‌ కర్రెగుట్టలు మొదలైంది..! కేంద్ర ప్రభుత్వం చేపట్టిన మావోయిస్టుల ఏరివేత కార్యక్రమం ‘ఆపరేషన్‌ కగార్‌’కు కర్రెగుట్టలు ఆఖరి మజిలీగా బలగాలు భావిస్తున్నాయి. సోమ, మంగళవారాల్లో ఈ ప్రాంతం వైపు కదిలిన బలగాలు.. బుధవారం ఉదయానికి గుట్టలను చేరుకున్నాయి. ఈ ప్రాంతానికి ‘ఆంధ్రజ్యోతి’ చేరుకుంది. అయితే.. అడుగడుగునా పోలీసుల దిగ్బంధం, రహదారుల మూసివేత కారణంగా.. అతికష్టమ్మీద.. బుధవారం మధ్యాహ్నానికి ఆంధ్రజ్యోతి ప్రతినిధి కర్రెగుట్టలను చేరుకున్నారు. గుట్టలను సమీపిస్తున్న కొద్దీ.. బాంబుల మోతతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లుతుండడాన్ని గుర్తించారు. అయితే.. భీమారంపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన పోలీసు బేస్‌ నుంచి ముందుకు వెళ్లడానికి వీల్లేదని నిలిపివేశారు. గ్రామస్థులకు కూడా ఇవే ఆదేశాలు జారీ చేశారు. ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచించారు. అక్కడి నుంచి వార్తాసేకరణ కొనసాగించిన ‘ఆంధ్రజ్యోతి’కి ప్రతి రెండు నిమిషాలకు ఒకటి చొప్పున బాంబు పేలుళ్లు వినిపించాయి. కర్రెగుట్టలకు సమీపంలో ఉండే రాంపురం, భీమారంపాడు గ్రామాలు పోలీసుల ఆంక్షలతో నిర్మానుష్యంగా మారాయి.

తెలంగాణ వైపు నుంచి కూంబింగ్‌

ఛత్తీస్‌గఢ్‌లోని పూజారి కాంకేర్‌ వైపు బలగాలు రహదారులను దిగ్బంధం చేసి, అక్కడ కాల్పులను ప్రారంభించాయి. దాంతో మావోయిస్టులు తెలంగాణలోని ములుగు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలోకి వస్తారని భావిస్తూ.. ఈ ప్రాంతంలో ముమ్మరంగా కూంబింగ్‌ ప్రారంభించాయి. సుమారు 4 వేల మందికి పైగా సీఆర్‌పీఎఫ్‌, కోబ్రా, డీఆర్‌జీ, బస్తర్‌ఫైటర్స్‌ బలగాలతోపాటు.. తెలంగాణ పోలీసులు కూడా కర్రెగుట్టలను చుట్టుముట్టిన వారిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఓ వైపు కూంబింగ్‌ కొనసాగిస్తూనే.. బాంబ్‌ డిస్పోజబుల్‌, డాగ్‌ స్క్వాడ్‌లు గుట్టల చుట్టూ మావోయిస్టులు అమర్చిన మందుపాతరలను గుర్తించి, నిర్వీర్యం చేస్తున్నాయి. తెలంగాణ వైపు.. వెంకటాపురం మండలంలోని రాచపల్లి కలిపాక, మోట్లగూడెం ప్రాంతాల వరకు కూడా రెండుమూడు నిమిషాలకో బాంబు పేలుడు శబ్దం వినిపిస్తోందని స్థానికులు తెలిపారు. ఈ పేలుళ్లు మావోయిస్టులు అమర్చిన మందుపాతరలను నిర్వీర్యం చేస్తున్న క్రమంలో సంభవిస్తున్నట్లు సమాచారం.

వెంకటాపురంలో బస్తర్‌ ఐజీ

బస్తర్‌ రేంజ్‌ ఐజీ పి.సుందర్‌రాజ్‌ వెంకటాపురం నుంచే ‘బచావో కర్రెగుట్టలు’ ఆపరేషన్‌ను పర్యవేక్షిస్తున్నట్లు తెలిసింది. ఆయన వెంట ఛత్తీస్‌గఢ్‌ పోలీసు అధికారులు కూడా ఉన్నట్లు సమాచారం. వెంకటాపురం సమీపంలోని హెలిప్యాడ్‌ నుంచే బలగాలకు హెలికాప్టర్‌లో నిత్యావసరాలను చేరవేస్తున్నట్లు తెలుస్తోంది. కర్రెగుట్టల చుట్టూ కేంద్ర బలగాలకు చెందిన మూడు హెలికాప్టర్లు, పలు డ్రోన్లతో ఏరియల్‌ సర్వే నిర్వహిస్తూ.. మావోయిస్టుల ఉనికిని గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. కర్రెగుట్టల వైపు వెళ్తున్న బలగాలు కూడా.. తొలుత డ్రోన్లను పంపి.. ఆ తర్వాత ముందుకు సాగుతున్నట్లు సమాచారం.

చర్చలు జరపాలి: పీస్‌ డైలాగ్‌ కమిటీ

కేంద్రం, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌, ఝార్ఖండ్‌ ప్రభుత్వాలు వెంటనే కాల్పుల విరమణను పాటించి, మావోయిస్టులతో శాంతి చర్చలకు సానుకూల వాతావరణాన్ని కల్పించాలని పీస్‌ డైలాగ్‌ కమిటీ(పీడీసీ) చైర్మన్‌ జస్టిస్‌ బి.చంద్రకుమార్‌ విజ్ఞప్తి చేశారు. బుధవారం బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పీడీసీ వైస్‌ చైర్మన్లు జంపన్న, బాలకృష్ణారావు, కందిమల్ల ప్రతాప్‌ రెడ్డి, ప్రొఫెసర్‌ వినాయకరెడ్డి, ఎస్‌.జీవన్‌కుమార్‌తో కలిసి ఆయన మాట్లాడారు. హింస ద్వారా సాధించేదేమీ లేదని, మావోయిస్టులు ఇప్పటికే మూడు సార్లు శాంతి చర్చలకు సిద్ధమని ప్రకటించినట్లు వారు గుర్తుచేశారు.దీనిపై ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా, ముఖ్యమంత్రులు స్పందించాలని కోరారు. ‘‘కర్రెగుట్టల చుట్టూ 10 వేల మంది పోలీసులను మోహరించి, కూంబింగ్‌ చేస్తున్నారు. మావోయిస్టుల పేరుతో అమాయక ఆదివాసీలను కాల్చిచంపుతున్నారు. కర్రెగుట్ట నుంచి పోలీసు బలగాలను వెనక్కి రప్పించడానికి సీఎం రేవంత్‌రెడ్డి చొరవ చూపాలి’’ అని వారు డిమాండ్‌ చేశారు.

ఇవి కూడా చదవండి..

Pahalgam Terror Attack: ఉగ్ర ‘వేట’ మైదలైంది… జల్లెడ పడుతున్న భద్రతా బలగాలు

Pahalgam Terror Attack: జనసేన మూడు రోజుల సంతాప దినాలు.. జెండాల అవనతం

Pahalgam Terror Attack: ఉగ్రవాదులతో పోరాడిన ఒక్కే ఒక్కడు

Pahalgam Attack: భార్యాపిల్లల కళ్లముందే ఐబీ అధికారిని కాల్చిచంపారు

Updated Date – Apr 24 , 2025 | 05:58 AM

Exit mobile version