అమరావతి, ఏప్రిల్ 24: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పదో తరగతి ఫలితాలు 2025 బుధవారం (ఏప్రిల్ 23) విడుదలైన సంగతి తెలిసిందే. అయితే టెన్త్‌లో మార్కులు తక్కువ వచ్చాయని, ఫెయిల్ అయ్యామని పలువురు విద్యార్ధులు మనస్తాపం చెంది వేర్వేరు చోట్ల ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
తక్కువ మార్కులొచ్చాయనీ..
పొందూరు మండలం మజ్జిలిపేట గ్రామానికి చెందిన గురుగుబిల్లి అమ్మినాయుడు, ఝాన్సీ దంపతులు శ్రీకాకుళం నగరంలోని బలగ ప్రాంతంలో నివాసముంటున్నారు. వీరి కుమారుడు వేణుగోపాలరావు (15) స్థానిక ప్రైవేటు పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. బుధవారం విడుదలైన ఫలితాల్లో 600కు 393 మార్కులు రావడంతో వేణు గోపాలరావు తీవ్ర మనస్తాపం చెందాడు. దీంతో ఉదయం 11 గంటల సమయంలో గదిలోకి వెళ్లి ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. టెన్త్ ఫలితాలు వచ్చిన గంట వ్యవధిలోనే కన్న కొడుకు విగతజీవిగా మారడం చూసి తల్లిదండ్రులు గుండెలవిసేలా రోధించారు.
మూడోసారి కూడా టెన్త్ తప్పాడనీ..
అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలం అరిగిరివారిపల్లెకు చెందిన మోహన్ కుమారుడు విష్ణువర్దన్ (17) అనే మరో పదో తరగతి విద్యార్ధి పరీక్షల్లో తప్పాడని మనస్తాపంతో బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంటి పైకప్పుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. విష్ణు గతంలో రెండు పర్యాయాలు పదోతరగతి పరీక్షలు తప్పాడు. మూడో పర్యాయం కూడా పాస్ కాలేదని తీవ్ర మనస్తాపం చెంది ఈ దారుణానికి పాల్పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పల్లెత్తు మాట అనకున్నా చెట్టుంత కొడుకు అర్ధాంతరంగా తనువు చాలించడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.
ఇవి కూడా చదవండి
క్షణికావేశంలో ఇంకొకరు
పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత కానందుకు మనస్తాపానికి గురైన మరో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఫిరంగిపురం గ్రామానికి చెందిన పి.వినయకుమార్ (16) స్థానికంగా ఓ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. బుధవారం వచ్చిన పదో తరగతి పరీక్షల ఫలితాల్లో ఫెయిల్ అయినట్లు తెలియడంతో మనస్తాపానికి గురై తన తాత పాపయ్య ఇంటికి వచ్చి ఫ్యాన్‌కు ఉరి వేసుకొన్నాడు. చుట్టు పక్కల వారు గమనించి విద్యార్థిని హుటాహుటీన ప్రయివేటు వైద్యశాలకు తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యుడు తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.