మహిళలూ మీకే ఈ అలెర్ట్. బైక్‌పై వెళ్లేటప్పుడు.. చీర కొంగు విషయంలో, చున్నీ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. లేదంటే.. ప్రాణానికే ప్రమాదం. తాజాగా ఓ వివాహిత అలానే ప్రాణాలు పొగొట్టుకుంది. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలంలో ఈ విషాద ఘటన వెలుగుచూసింది. ఎన్నో ఆశలతో వైవాహిత జీవితంలోకి అడుగుపెట్టిన ఆ యువతి.. పెళ్లై ఏడాది కూడా గడవకుండానే అనంత లోకాలకు వెళ్లిపోయింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… తూర్పుగోదావరి జిల్లా కేసనకుర్రుకు చెందిన రామదుర్గ (28)కు.. కోనసీమ జిల్లా పోలవరంకు చెందిన మోహన్‌కృష్ణతో తొమ్మిది నెలల క్రితం పెళ్లి జరిగింది. మోహన్‌కృష్ణకు అచ్యుతాపురం సెజ్‌లో.. ఇటీవల జాబ్ రావడంతో వారు అక్కడి సమీప ప్రాంతంలో ఇల్లు అద్దెకు తీసకుని నివాసం ఉంటున్నారు. రామదుర్గకు చెవి నొప్పిగా ఉండటంతో.. సోమవారం రాత్రి 7 గంటలకు భర్త ఆమెను తీసుకుని ద్విచక్రవాహనంపై ఆసుపత్రికి బయలుదేరారు. వారి బైక్ హరిపాలెం ప్రాంతానికి వచ్చిన సమయంలో రామదుర్గ వేసుకున్న చున్నీ బైక్ వెనకచక్రంలో పడి.. మెడకు బిగుసుకుపోయింది. అటుగా వెళ్లున్నవారు గమనించి అప్రమత్తం చేసేలోపే.. ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. స్థానికులు సాయంతో భర్త వెంటనే చున్నీని కత్తిరించి ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. పిల్లా పాపలతో నిండు నూరేళ్లు ఆనందంగా ఉంటుంది అనుకున్న కూతురు.. ఇలా పెళ్లయిన 9 నెలలకే కన్నుమూయడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..