అమరావతి, ఏప్రిల్ 09: వక్ఫ్ బోర్డు ఆస్తులు అమ్ముతున్నామనే ప్రచారం పూర్తి అబద్ధమని ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ స్పష్టం చేశారు. బోర్డుకు సంబంధించిన ఆస్తులు లీజుకు మాత్రమే ఇస్తారని ఆయన పేర్కొన్నారు. బుధవారం అమరావతిలో అబ్దుల్ అజీజ్ విలేకర్లతో మాట్లాడుతూ.. 30 వేల ఎకరాలు వక్ఫ్ బోర్డు భూములున్నాయన్నారు. వాటి నుంచి వచ్చే ఆదాయం ద్వారా పేద ముస్లింలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తామని ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి సంక్షేమ పథకాలు ముస్లింలకు అందేవి కావన్నారు. ఏ పని చేయాలన్నా నిధులు సైతం ఉండేవి కావని ఆయన గుర్తు చేశారు. గతంలో ఏమైనా ముస్లింలకు కావాలంటే.. వక్ఫ్ బోర్డు నుంచి వస్తాయని అనుకునే వాళ్ళమన్నారు.
రంజాన్ తర్వాత రమ్మన్నారు..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి వక్ఫ్ బోర్డ్‌కు 60 వేల ఎకరాలపైనే ఆస్తులున్నాయని గుర్తు చేశారు. ఈ రోజుకు ఆ వక్ఫ్ బోర్డ్ వివరాలు తెలంగాణలోనే ఉన్నాయని చెప్పారు. 70 శాతం నిధులు అక్కడే ఆగిపోయాయని తెలిపారు. తాను ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అయిన తర్వాత తెలంగాణ వక్ఫ్ బోర్డ్ చైర్మన్‌ని కలిశానన్నారు. అయితే రంజాన్ అయిన తర్వాత మీరు అధికారికంగా రావాలని ఆయన పేర్కొన్నారని చెప్పారు.
వివరాలు తెలుసుకొంటున్నా..
తాను చైర్మన్ అయిన తర్వాత పూర్తి స్థాయిలో వివరాలు తెలుసుకొంటూ ముందుకు వెళ్తున్నామని చెప్పారు. ఆస్తులు అన్యాక్రాంతం కావడానికి ముఖ్య కారణం.. ఈ ఆస్తులను పూర్తి స్థాయిలో వినియోగించుకోక పోవడమేనన్నారు. వక్ఫ్ బోర్డ్ ఆస్తులను ఏ విధంగా వినియోగించాలనేది తెలుసుకోవాలన్నారు.
హిందూ దేవాలయాల ఆస్తులు ఎలాగో.. అలాగే..
ఇప్పటి వరకు 34 వేల ఎకరాలు అన్యాక్రాంతమయ్యాయని వివరించారు. సీఎం చంద్రబాబు ఒక్కటే చెప్పారు.. హిందూ దేవాలయాల ఆస్తులు ఏ విధంగా కాపాడుతారో అదే విధంగా వక్ఫ్ ఆస్తులను కాపాడాలన్నారన్నారు. వక్ఫ్ బోర్డులో ఉన్నత విద్యావంతులు వున్నారన్నారు. ముస్లిం బిడ్డలు కార్పొరేట్ విద్యలు చదువుకోలేని పరిస్థితిలో ఉన్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
రెంట్ రివ్యూ కమిటీ వేయాలి..
రెంట్ రివ్యూ కమిటీ వేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. చిన్న చిన్న షాప్ లకు రూ. 200 అద్దె ఇచ్చే పరిస్థితి వుందన్నారు. వేల సంస్థలున్నాయి.. వాటి పేరు మీద వక్ఫ్ బోర్డు ఆస్తులు ఉంటాయిని చెప్పారు. వక్ఫ్ బోర్డు ఆస్తులు 3 ఏళ్లకు లీజుకి ఇచ్చే అవకాశం వుందన్నారు. మూడు ఏళ్ళు పూర్తయితే రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తీసుకోవాల్సి ఉందని చెప్పారు.
ఇవి దేవుడి ఆస్తులు..
ఇవి దేవుడి ఆస్తులు.. ఎవ్వరికీ అమ్మటం కుదరదు.. కేవలం లీజుకు మాత్రమే ఇస్తారని స్పష్టం చేశారు. ఓ వేళ లీజుకి ఇవ్వాలన్నా.. ముగ్గురి అనుమతి తీసుకోవాలి ఉందని తెలిపారు. ప్రభుత్వం అనుమతి లేకుండా మూడు ఏళ్ళు లీజుకి ఇవ్వటం కుదరదని ఆయన పేర్కొన్నారు.
రూ. 3 నుంచి రూ. 4 కోట్లు ఖర్చు..
3000 ఎకరాలపైన భూములను వక్ఫ్ బోర్డు సంరక్షణ చేస్తుందన్నారు. 200 మంది 10వ తరగతి బిడ్డలను చదివించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. 30 వేల ఎకరాలకు ఫెన్సింగ్ చేయాలంటే రూ. 3 నుంచి 4 కోట్ల వరకు ఖర్చవుతుందన్నారు. సీఎం చంద్రబాబు ఆలోచనలతో ముందుకు వెళ్తున్నామని వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ పేర్కొన్నారు.
Updated Date – Apr 09 , 2025 | 08:44 PM