
ఇటీవల సోషల్ మీడియాలో ఓ పోస్టు వైరల్ అవుతోంది. ఏటీఎంలో బ్యాంకు డెబిట్ కార్డును పెట్టే ముందు రద్దు చేయి బటన్ ను రెండు సార్లు నొక్కితే మోసాల బారిన పడకుండా ఉండొచ్చని దాని సారాంశం. అది నిజమేనా.. దాని వెనుక ఉన్న అసలు సంగతి ఏమిటో తెలుసుకుందాం. ఏటీెఎంలో లావాదేవీలు నిర్వహించే ముందు మెషీన్ లోని రద్దు చేయి అనే బటన్ రెండు సార్లు నొక్కితే మంచిదని ఇటీవల సోషల్ మీడియలో ఓ పోస్టు వైరల్ అవుతోంది. అది రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా విడుదల చేసినట్టు ప్రచారం జరుగుతోంది. దీంతో చాలామంది వినియోగదారులు దాన్ని నిజమనుకుంటున్నారు. ఏటీఎం వద్దకు వెళ్లినప్పుడు అలాగే చేస్తున్నారు. అసలు ఇది నిజమేనా అనే సందేహాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు.
సోషల్ మీడియా పోస్టు నేపథ్యంలో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూర్ (పీఐబీ) రంగంలోకి దిగింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టును పరిశీలించింది. అనంతరం అది నకిలీ పోస్టుగా తేల్చింది. ఏటీఎం మెషీన్ లో అలా చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని వెల్లడించింది. రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఆ పోస్టు చేయలేదని కూడా తేల్చి చెప్పింది. సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఏటీెఎం వద్ద అపరిచితులను నమ్మవద్దని హెచ్చరించింది. టెక్నాలజీపై అవగాహన పెంచుకుని, దానికి అనుగుణంగా లావాదేవీలు నిర్వహిస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవని తెలిపింది.
ఆధునిక కాలంలో పెరిగిన సాంకేతికతతో బ్యాంకు లావాదేవీలు చాలా సులువుగా జరుగుతున్నాయి. గతంలో డబ్బులను తీసుకోవాలంటే ఉదయాన్నే బ్యాంకుకు వెళ్లాల్సి వచ్చేది. అక్కడ లైన్ లో నిలబడి మన వంతు వచ్చాక డబ్బులను తీసుకునేవాళ్లం. ఈ పని చేయడానికి దాదాపు ఒక పూట సమయం పట్టేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ప్రతి ఊరిలోనూ ఏటీెఎం లు వచ్చేశాయి. ఏ సమయంలోనైనా అక్కడకు వెళ్లి చాలా సులువుగా డబ్బులు తీసుకోవచ్చు. అయితే ఏటీఎం వద్ద అనేక మోసాలు జరుగుతున్న నేపథ్యంలో జాగ్రత్తల పేరుతో నకిలీ పోస్టులు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటితో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని అధికారులు చెబుతున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..