Konda Vs Ponguleti: ఇటీవల మేడారం అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించడానికి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క మేడారం వచ్చారు. ఆ సమయంలో దేవాదాయ శాఖ మంత్రిగా కొండా సురేఖ సమీక్షకు హాజరు కాలేదు. దీనంతటికీ మేడారంలో జరుగుతున్న పనులను శ్రీనివాస్ రెడ్డి కంపెనీ చేపట్టడమే కారణమని తెలియ వచ్చింది. దీనిపై కొండ సురేఖ ప్రభుత్వ పెద్దలపై ఆగ్రహంగా ఉన్నట్టు మీడియాలో వార్తలు వచ్చాయి. దీనికి తోడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొండా సురేఖ, ఆమె భర్త మురళి పై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు ప్రచారం జరిగింది. అయితే దానిని కొండా వర్గీయులు ఖండించారు. ఇక బుధవారం నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మాతృమూర్తి కాంతమ్మ దశదినకర్మ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ హాజరయ్యారు. ముఖ్యమంత్రి వెంట ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు ఉన్నారు. కానీ అప్పుడు కూడా కొండా సురేఖ కనిపించలేదు. ఇదంతా కూడా ఉమ్మడి వరంగల్ రాజకీయాలలో సంచలనం కలిగించింది.
ముఖ్యమంత్రి వచ్చి వెళ్లిన వెంటనే కొండా సురేఖ ఇంటికి టాస్క్ ఫోర్స్ పోలీసులు వచ్చారు. ఆ సమయంలో కొండా సురేఖ కూతురు సుస్మిత ఇంట్లో ఉన్నారు. టాస్క్ ఫోర్స్ పోలీసులతో ఆమె గొడవ పడ్డారు.. దీనంతటికీ సురేఖ ప్రైవేటు ఓ ఎస్ డి సుమంత్ కారణమని గుసగుసలు వినిపిస్తున్నాయి. సుమంత్ సురేఖ పర్యవేక్షించే దేవాదాయ, అటవీ శాఖలలో ఇష్టానుసారంగా ప్రవర్తించాడని.. ఏకంగా ఐఏఎస్ అధికారులను శాసించే స్థాయికి ఎదిగాడని ఇంటెలిజెన్స్ పోలీసుల దర్యాప్తులో తేలింది. పైగా అతడు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని.. అందువల్లే ప్రభుత్వం అతడిని విధుల నుంచి తొలగించిందని నిన్నటి నుంచి వార్తలు వస్తున్నాయి. సమగ్రంగా దర్యాప్తు చేసిన తర్వాత సుమంత్ కోసం నిన్నటి నుంచి పోలీసులు గాలిస్తున్నారు. సుమంత్ సురేఖ ఇంట్లో తలదాచుకున్నట్టు సమాచారం రావడంతో.. పోలీసులు మంత్రి ఇంటికి వెళ్లారు.
మంత్రి ఇంటికి వెళ్లిన సమయంలో సుస్మిత పోలీసులతో వాగ్వాదానికి దిగింది. అంతేకాదు ఈ సమయంలో ఒక సంచలన విషయాన్ని కూడా ఆమె బయట పెట్టింది.. డబ్బులు ఇవ్వాలని డక్కన్ సిమెంట్స్ కంపెనీవారిని పాయింట్ బ్లాంక్ లో గన్ పెట్టి కొండా సురేఖ ఓ ఎస్ డి సుమంత్ బెదిరించినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదంతా కూడా రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు రోహిన్ రెడ్డి ఆఫీసులో జరిగిందని ప్రచారం జరుగుతోంది. దీనిపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు కూడా చేసినట్టు తెలుస్తోంది. అందువల్లే సుమంత్ ను సురేఖ, సుస్మిత దాచిపెట్టారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. సుమంత్ ను అరెస్ట్ చేయడానికి సురేఖ ఇంటికి పోలీసులు వచ్చారు. అందువల్లే సురేఖ కుమార్తె సుస్మిత పోలీసులను అడ్డుకున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు సుమంత్ ను తన కారులో కూర్చోబెట్టుకొని వేరే ప్రాంతానికి తీసుకెళ్ళినట్టు కూడా ప్రచారం జరుగుతోంది. ఏది ఏమైనప్పటికీ మొన్నటిదాకా కొండా దంపతులకు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి మధ్య మాత్రమే వివాదం ఉండేది. ఇప్పుడు ఇందులోకి ముఖ్యమంత్రి పేరు రావడంతో ఒక్కసారిగా ఈ విషయం సంచలనంగా మారింది.