
దిశ, బిజినెస్ బ్యూరో: భారత ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆహార భద్రత కమిషనర్లు, కేంద్ర లైసెన్సింగ్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. అన్ని ఆహార వ్యాపార నిర్వాహకులు (ఎఫ్‌బీఓలు) తమ ఆహార ఉత్పత్తులపై ‘ఓఆర్ఎస్’ అనే పదాన్ని తొలగించాలని స్పష్టం చేసింది. ఈ పదాన్ని ఏ రకంగానూ ఉపయోగించవద్దని, ఉత్పత్తి పేరులో ట్రేడ్‌మార్క్‌గానూ వాడకూడదని ఆదేశాల్లో పేర్కొంది. అలా ‘ఓఆర్ఎస్ ‘ పదాన్ని వాడటం ఆహార భద్రత, ప్రమాణాల చట్టం-2006 నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తుందని వెల్లడించింది. సంబంధిత అధికారులందరూ ఈ చట్టం సూచించిన లేబులింగ్, ప్రకటనల అవసరాలకు, దాని కింద రూపొందించిన నిబంధనలకు కట్టుబడి ఉండేలా చూసుకోవాలని కోరింది.
గతంలో ఇచ్చిన ఉత్తర్వుల్లో ఎఫ్ఎస్ఎస్ఏఐ.. ఆహార ఉత్పత్తులైన పండ్ల రసాలు, నాన్-కార్బొనేటెడ్, రెడీ-టూ-డ్రింక్ బేవరేజెస్‌లకు అనుబంధనంగా గానీ, జతగా గానీ లేబుళ్లపై ఉపయోగించేందుకు అనుమతిచ్చింది. అయితే, ‘డబ్ల్యూహెచ్ఓ సిఫార్సు చేసిన ఓఆర్ఎస్ ఫార్ములా కాదు ‘ అనే హెచ్చరిక ఉండాలని సూచించింది. అయితే, ఎఫ్ఎస్ఎస్ఏఐ మరింత సమగ్రంగా సమీక్షించిన తర్వాత, పండ్ల రసాలు, నాన్-కార్బొనేటెడ్, రెడీ-టూ-డ్రింక్ బేవరేజెస్ వంటి ఆహార ఉత్పత్తుల కోసం ట్రేడ్‌మార్క్ చేసిన పేరులో లేదా మరేదైనా ‘ఓఆర్ఎస్’ అనే పదాన్ని ఏ విధంగానైనా ఉపయోగిస్తే ఆహార భద్రత, ప్రమాణాల చట్టంలోని నిబంధనలను ఉల్లంఘించడమేనని తాజాగా తెలిపింది. ఇలాంటి పద్ధతులు తప్పుడు, మోసపూరిత, అస్పష్టమైనవని, నకిలీ పేర్లు లేదా లేబుల్ ప్రకటనలను ఉపయోగించి వినియోగదారులను తప్పుదారి పట్టిస్తున్నట్టు గుర్తించామని ఎఫ్ఎస్ఎస్ఏఐ వివరించింది. అన్ని ఆహార వ్యాపార నిర్వాహకులు తక్షణమే నిబంధనలను పాటించేలా చూసుకోవాలని, ఉల్లంఘనలపై అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను కూడా ఆదేశించింది.