– Advertisement –
ఆరుగురు మృతి
వెనిజులాకు మాదక ద్రవ్యాలు రవాణా చేస్తోందని ట్రంప్ ఆరోపణ
వాషింగ్టన్ : వెనిజులాకు మాదక ద్రవ్యాలు రవాణా చేస్తున్న ఓ చిన్న పడవపై దాడి చేశామని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఈ దాడిలో పడవలో ఉన్న ఆరుగురు చనిపోయారని, అమెరికా దళాలకు ఎలాంటి నష్టం జరగలేదని చెబుతూ సామాజిక మాధ్యమంలో ఆయన మంగళవారం ఓ పోస్ట్ పెట్టారు. కరేబియన్ ప్రాంతంలో అమెరికా జరిపిన అతి పెద్ద దాడుల్లో ఇది ఐదోది. మాదక ద్రవ్యాలు రవాణా చేస్తున్న వారిని చట్టవ్యతిరేకంగా తమపై పోరాడుతున్న వారిగానే పరిగణిస్తామని ట్రంప్ ప్రభుత్వం స్పష్టం చేసింది. అలాంటి వారికి సైనిక శక్తితో సమాధానం చెప్పాల్సిందేనని తెలిపింది. వెనిజులా వైపు వెళుతున్న ఓడలు, పడవలపై ట్రంప్ ప్రభుత్వం జరుపుతున్న దాడిని ప్రతిపక్ష డెమొక్రాట్లే కాకుండా అధికార రిపబ్లికన్లు కూడా తప్పుపడుతున్నారు. ప్రభుత్వ చర్య చట్టబద్ధమైనదేనా అని కొందరు రిపబ్లికన్ సభ్యులు సందేహం వ్యక్తం చేశారు.
దీనిపై అధ్యక్ష భవనం మరింత సమాచారాన్ని అందించాలని, దాడుల వివరాలు బయటపెట్టాలని కోరారు. ఈ దాడులు అమెరికా, అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తున్నాయని డెమొక్రాట్లు ఆరోపించారు. కాగా పడవపై దాడి చేయాల్సిందిగా ట్రంప్, రక్షణ మంత్రి పీట్ హెగ్‌సేథ్ మంగళవారం ఉదయం ఆదేశాలు జారీ చేశారు. దాడికి సంబంధించిన వీడియోను కూడా విడుదల చేశారు. అంతర్జాతీయ జలాల్లో దాడి జరిగిందని అంటూనే పడవలో మాదక ద్రవ్యాల రవాణా జరుగుతోందని ఇంటెలిజెన్స్ ధృవీకరించిందని తెలిపారు. ప్రతినిధి సభ అనుమతి లేకుండా దాడులు జరపకుండా ట్రంప్ ప్రభుత్వాన్ని నిరోధించే తీర్మానంపై గత వారం సెనెట్‌లో ఓటింగ్ జరిగింది. అయితే తీర్మానం వీగిపోయింది. తాము దాడి చేస్తున్న ఓడలు, పడవల్లో మాదక ద్రవ్యాలు రవాణా అవుతున్నాయని నిర్ధారించే ఆధారాలేవీ ట్రంప్ ప్రభుత్వం ఇప్పటి వరకూ సభ్యులకు అందజేయలేదు. ఇటీవలి కాలంలో కరేబియన్‌లో అమెరికా నౌకాదళం కదలికలు పెరుగుతున్నాయి.
– Advertisement –