పాక్-ఆఫ్ఘన్ మధ్య తాత్కాలిక సంధి.. 48 గంటల పాటు కాల్పుల విరమణకు అంగీకారం

పాకిస్థాన్,ఆఫ్గనిస్తాన్ సరిహద్దులో కొన్ని గంటల పాటు జరిగిన భీకర దాడులు, ప్రతిదాడుల అనంతరం, ఇరు దేశాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి.ఎక్కువమంది ప్రాణాలను తీసిన ఈ హింసకు తాత్కాలికంగా బ్రేక్ వేస్తూ, 48 గంటల కాల్పుల విరమణకు ఇరు పక్షాలు ఒప్పుకున్నాయి.బుధవారం సాయంత్రం 6 గంటలకు (భారత సమయం ప్రకారం 6:30) ఈ ఒప్పందం అమలు ప్రారంభమైంది.ఈ సంక్లిష్టమైన సమస్యకు చర్చల ద్వారా సానుకూల పరిష్కారం కనుగొనేందుకు ఇరుపక్షాలు చిత్తశుద్ధితో ప్రయత్నిస్తాయని ఇస్లామాబాద్ ఒక ప్రకటనలో పేర్కొంది.ఆఫ్గనిస్తాన్ కోరిక మేరకే కాల్పుల విరమణకు అంగీకరించమని పాకిస్థాన్ తెలిపింది.అయితే, ఆఫ్గనిస్తాన్ నుండి ఇప్పటివరకు కాల్పుల విరమణ లేదా ఒప్పందంపై ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.

పాకిస్థాన్ దాడుల్లో 12 మంది పౌరులు మృతి
అంతకుముందు, తమపై రెచ్చగొట్టే దాడులకు పాల్పడిన ఆఫ్ఘన్ బలగాలను తిప్పికొట్టామని పాకిస్థాన్ ప్రకటించింది.ఈ సైనిక చర్యల్లో డజన్లకొద్దీ ఆఫ్గన్ భద్రతా సిబ్బంది, మిలిటెంట్లు హతమయ్యారని, వారి ట్యాంకులు, సైనిక కేంద్రాలను ధ్వంసం చేశారని పాకిస్థాన్ పేర్కొంది.అయితే, కాందహార్ ప్రావిన్స్‌లో సాధారణ పౌరులపై దాడి చేసినట్లు వచ్చిన ఆరోపణలను పాకిస్తాన్ ఖండించింది.మరో వైపు, పాకిస్థాన్ దాడుల్లో 12 మంది పౌరులు మృతి చెందారని, 100 కంటే ఎక్కువ మంది గాయపడ్డారని తాలిబన్ వర్గాలు ఆరోపించాయి.దీనికి ప్రతీకారంగా, తాము పాక్ సరిహద్దు కేంద్రాన్ని ధ్వంసం చేసి, ఒక ట్యాంక్‌ను స్వాధీనం చేసుకున్నామని తాలిబన్ల ప్రధాన ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ వెల్లడించారు.

పాక్ ఆరోపణలను ఖండించిన ఆఫ్గనిస్తాన్
పాకిస్థాన్ ఎక్కువకాలంగా, తమ దేశంలో జరుగుతున్న ఉగ్రవాద దాడులకు ఆఫ్గనిస్తాన్ మిలిటెంట్లకు ఆశ్రయం ఇస్తోందని ఆరోపిస్తోంది.2021లో తాలిబన్లు అధికారంలోకి వచ్చాక ఈ దాడులు పెరిగాయని చెబుతుంది.అయితే, ఆఫ్గనిస్తాన్ ఈ ఆరోపణలను ఖండిస్తోంది.తమ భూభాగం ఇతర దేశాలపై దాడికి ఉపయోగించనీయమని ఆఫ్గన్ విదేశాంగ మంత్రి ఆమిర్ ఖాన్ ముత్తఖీ ఇటీవల భారత్ పర్యటనలో స్పష్టం చేశారు.

Leave a Comment