Site icon Desha Disha

ఎసిబి వలలో నల్గొండ స్టేషన్ ఫైర్ ఆఫీసర్

ఎసిబి వలలో నల్గొండ స్టేషన్ ఫైర్ ఆఫీసర్

మన తెలంగాణ/నల్గొండ రూరల్: నల్లగొండ అగ్నిమాపక అధికారి ఏ.సత్యనారాయణరెడ్డిని గురువారం ఎసిబి అధికారులు పట్టుకున్నారు. క్రాకర్స్ దుకాణం అనుమతి కోసం రూ.8 వేలు డిమాండ్ చేసి లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని అతనిని అదుపులోకి తీసుకున్నారు. ఎసిబి డిఎస్‌పి జగదీశ్‌రెడ్డి తెలిసిన వివరాల ప్రకారం.. నల్లగొండ పట్టణంలో దీపావళి పండుగ సందర్భంగా నిర్మానుష్య ప్రదేశంలో బాణసంచా దుకాణాన్ని నడపడానికి ఫిర్యాదుదారుడి తాత్కాలిక లైసెన్స్ దరఖాస్తును ప్రాసెస్ చేయడానికి అగ్నిమాపక అధికారిని సంప్రదించాడు. రెవెన్యూ, పోలీస్ అధికారుల అనుమతులు తీసుకుని తదుపరి అనుమతి కోసం ఫిర్యాదుదారుడు అన్ని రకాల అనుమతులతో ఫైర్ అధికారిని సంప్రదించాడు.

అయితే, దీనికి రూ.10 వేలు లంచం కావాలని ఫైర్ అధికారి డిమాండ్ చేయడంతో ఫిర్యాదుదారుడు ఎసిబి అధికారులను ఆశ్రయించాడు. వారి సూచనల మేరకు బాధితుడు గురువారం సాయంత్రం సదరు అగ్నిమాపక అధికారికి రూ.8 వేలు ఇచ్చేందుకు సంప్రదించగా కార్యాలయం పక్కనే ఉన్న ఎన్‌జి కళాశాల గ్రౌండ్‌లో కలవాలని సూచించాడు. బాధితుడి నుండి రూ.8 వేలు లంచం తీసుకుంటుండగా నల్గొండ రేంజ్ యూనిట్ ఎసిబి అధికారులు రెడ్‌హ్యాండెడ్ గా పట్టుకున్నారు. కార్యాలయంలో పనిచేసే అధికారి బైక్ ట్యాంక్ కవర్ నుండి లంచం మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అంతేగాకుండా సత్యనారాయణరెడ్డిపై పలు అవినీతి ఆరోపణలు వచ్చాయని వాటిన్నింటిపై కూడా పూర్తి విచారణ చేసి నాంపల్లి ఎసిబి కోర్టుకు ముందు హాజరుపర్చనున్నట్లు తెలిపారు.

Exit mobile version