దేశంలో టెక్నాలజీ ఎంత పెరుగుతుందో అంతే ఇబ్బందికర పరిస్తితులు ఏర్పడుతున్నాయి. సైబర్ నేరాలు ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో రోజుకో కొత్తరకం సైబర్ నేరలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. డేటింగ్ యాప్స్ ద్వారా డబ్బులు గుంజే పనిలో సైబర్ కేటుగాళ్ళు అబ్బాయిలకు వల వేస్తూ ఇట్టే దోచుకుంటున్నారు. ఆన్‌లైన్ డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన అమ్మాయికి లక్షల రూపాయలు పంపించి మోసపోయాడు హైదరాబాద్ కు చెందిన యువకుడు. దీంతో అసలు వ్యవహారం బయటపడింది.
హైదరాబాద్ మహానగరంలోని మలక్‌పేట్‌కు చెందిన 32 సంవత్సరాల యువకుడు ఆన్‌లైన్ డేటింగ్, ఫ్రెండ్షిప్ యాప్ స్కామ్‌లో దాదాపు రూ. 6,49,840 మోసపోయాడు. యువకుడు పెళ్లి, లైవ్-ఇన్ రిలేషన్‌షిప్ కోసం అనుకూలమైన వ్యక్తిని వెతుకుతున్నాడు. అదే సమయంలో జూలై 9వ తేదీన టన్యా షర్మా అనే మహిళ వాట్సాప్ కాల్ చేసింది. ఆమె ఫ్రెండ్‌షిప్ గ్రూప్‌లో చేర్చేందుకు రూ. 1,950 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలని చెప్పింది. దీంతో బాధిత యువకుడు మొదట ఆ మొత్తం చెల్లించిన తర్వాత గ్రూపులో చేర్చారు. ఆ తర్వాత అమ్మాయిలు పరిచయం అవుతూ డబ్బులు అడిగారు.
వాట్సాప్ గ్రూపులో జాయిన్ అయినా కొద్ది రోజుల్లోనే ప్రీతి, రితికా అనే మహిళలు పరిచయమయ్యారు. మహిళలు రిఫండబుల్ కేటగిరీలలో హోటల్ బుకింగ్, మీటింగ్ కన్ఫర్మేషన్, సర్వీస్ ట్యాక్స్, అకౌంట్ వెరిఫికేషన్, ప్రైవసీ సెక్యూరిటీ ఇలా అన్ని కోణాల్లో చెల్లించాలని చెప్పడంతో బాధితుడు నమ్మి డబ్బులు బదిలీ చేశాడు. బాధితుడు నమ్మి మొత్తం రూ. 6,49,840ను అనేక బ్యాంక్ ఖాతాలకు బదిలీ చేశారు. తరువాత బాధితుడికి అనుమానం వచ్చి చెక్ చేయడంతో అసలు యవ్వారం బయటపడింది. ఆ తర్వాత బాగా ప్లాన్ చేసిన డేటింగ్ స్కామ్ అని గ్రహించి, హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వెంటనే వాట్సాప్ ఐడిలకు సంబంధించి బ్యాంకు లావాదేవీల వివరాలు రాబట్టి దర్యాప్తు చేస్తున్నారు.
డేటింగ్ యాప్‌లపై జాగ్రత్తగా ఉండాలని, తెలిసిన ముఖపరిచయం కలిగి పూర్తిస్థాయి వెరిఫికేషన్ అయిన తర్వాతే మహిళలతో రిలేషన్‌షిప్ చేసుకుంటే బాగుంటుందని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు. వాట్సాప్, సోషల్ మీడియాలో లేదా డేటింగ్ సైట్లలో అనవసర కాల్స్, మెసేజ్‌లు, ఫ్రెండ్‌షిప్, మ్యారేజ్ ఆఫర్లు వచ్చేలా ఉంటే నమ్మవద్దంటున్నారు. రిఫండబుల్ ఛార్జీలు, అడ్వాన్స్ పేమెంట్స్, మీటింగ్, మెంబర్‌షిప్, వెరిఫికేషన్ కోసం డబ్బు చెల్లించవద్దని, వలపు వల వేసి ఇలా దోపిడీకి సైబర్ కేటుగాళ్ళు దోచేస్తున్నారు. సంస్థను నిజంగా పరిశీలించుకుని, వ్యక్తిగత, ఆర్థిక వివరాలు పంచుకోవద్దంటున్నారు పోలీసులు. తెలియని, అనుకోని బ్యాంక్ ఖాతాలకు డబ్బు పంపవద్దని, వాస్తవమైన డేటింగ్ లేదా మ్యాట్రిమోనియల్ సర్వీసులు ఈ విధమైన చాలాసార్లు చెల్లింపులు కోరవని తెలిపారు. ఏవైనా ఆన్‌లైన్ నిర్ణయాల ముందే కుటుంబం, మిత్రులతో సలహాలు తీసుకోవలని సూచిస్తున్నారు.
సైబర్ క్రైమ్ జరిగిందని భావిస్తే, వెంటనే బాధితులు 1930కు కాల్ చేయాలని, లేదంటే cybercrime.gov.in సందర్శించి ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచిస్తున్నారు. తక్షణ సహాయం కోసం కాల్,వాట్సాప్ నెంబర్ 8712665171ని సంప్రదించాలని కోరుతున్నారు. డేటింగ్ యాప్ వాడే సమయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని, ఆ జాగ్రత్తగా ఉంటే వలపు వలవేసి డబ్బులు లాగుతారని సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు.
మరిన్ని క్రైమ్ వార్తల ఇక్కడ క్లిక్ చేయండి..