Site icon Desha Disha

యూఎన్‌హెచ్‌ఆర్‌సీకి భారత్‌ ఏడోసారి ఎన్నిక

యూఎన్‌హెచ్‌ఆర్‌సీకి భారత్‌ ఏడోసారి ఎన్నిక

– Advertisement –

న్యూయార్క్‌ : 2026-28 కాలానికి సంబంధించి ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కౌన్సిల్‌కు (యూఎన్‌హెచ్‌ఆర్‌సీ) భారత్‌ ఎన్నికైంది. జెనీవాలో ఉన్న ఈ సంస్థకు భారత్‌ ఎన్నిక కావడం ఇది ఏడోసారి. మంగళవారం జరిగిన ఎన్నికల ఫలితాన్ని యూఎన్‌హెచ్‌ఆర్‌సీ ఓ సోషల్‌ మీడియా పోస్టులో ప్రకటించింది. మూడు సంవత్సరాల పదవీకాలం 2026 జనవరి 1వ తేదీన ప్రారంభమవుతుందని తెలిపింది. అపూర్వ మద్దతు అందించిన ప్రతినిధులకు ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధిగా వ్యవహరిస్తున్న పర్వతనేని హరీష్‌ కృతజ్ఞతలు తెలియజేశారు. మానవ హక్కులు, ప్రాథమిక స్వేచ్ఛలకు భారత్‌ కట్టుబడి ఉన్నదని చెప్పడానికి ఈ ఎన్నిక ఉదాహరణ అని ఆయన చెప్పారు. ఈ పదవీకాలంలో ఆ లక్ష్యాల సాధనకు కృషి చేస్తామని అన్నారు. ఐరాస మానవ హక్కుల కౌన్సిల్‌లో 47 సభ్య దేశాలు ఉన్నాయి.

వీటిని ఐరాస సర్వసభ్య సమావేశం ఎన్నుకుంటుంది. కౌన్సిల్‌లోని స్థానాలను ఐదు ప్రాంతీయ గ్రూపులు…ఆఫ్రికా దేశాలు (13 సీట్లు), ఆసియా-పసిఫిక్‌ దేశాలు (13 సీట్లు), తూర్పు యూరోపియన్‌ దేశాలు (6 సీట్లు), లాటిన్‌ అమెరికా, కరేబియన్‌ దేశాలు (8 సీట్లు), పశ్చిమ యూరోపియన్‌, ఇతర దేశాలకు (7 సీట్లు) కేటాయిస్తారు. 2006లో కౌన్సిల్‌ను ఏర్పాటు చేయగా 2011, 2018, 2025లో మినహా భారత్‌ వరుసగా సభ్యురాలిగా ఎన్నికవుతూనే ఉంది. 2006లో తొలిసారి కౌన్సిల్‌ ఎన్నిక జరగ్గా 190 దేశాల్లో అత్యధికంగా 173 దేశాలు మనల్ని బలపరిచాయి. తాజాగా భారత్‌తో పాటు అంగోలా, చిలీ, ఈక్వెడార్‌, ఈజిప్ట్‌, ఎస్టోనియా, ఇరాక్‌, ఇటలీ, మారిషస్‌, పాకిస్తాన్‌, స్లొవేనియా, దక్షిణాఫ్రికా, బ్రిటన్‌, వియత్నాం దేశాలు కూడా కౌన్సిల్‌కు ఎన్నికయ్యాయి.

– Advertisement –

Exit mobile version