
2030లో అహ్మదాబాద్ వేదికగా మెగా పోటీలు
లండన్: ప్రతిష్ఠాత్మకమైన కామన్‌వెల్త్త్ క్రీడలకు భారత్ రెండో ఆతిథ్యం ఇవ్వనుంది. గుజరాత్‌లోని అహ్మదాబాద్ వేదికగా 2030లో కామన్‌వెల్త్త్ పోటీలు జరుగనున్నాయి. ఇంతకుముందు 2010లో రాజధానిఢిల్లీలో కామన్‌వెల్త్త్ పోటీలను నిర్వహించారు. తాజాగా రెండోసారి మెగా పోటీలకు భారత్ వేదికగా నిలువనుంది. ఒలింపిక్స్ తర్వాత ప్రపంచ క్రీడల్లో రెండో అతి పెద్ద క్రీడా సంగ్రామంగా కామన్‌వెల్త్ గేమ్స్ పేరు తెచ్చుకున్నాయి. మరో ఐదేళ్ల తర్వాత జరిగే పోటీలను అహ్మదాబాద్‌లో నిర్వహించేందుకు కామన్‌వెల్త్ స్పోర్ట్ బాడీ నిర్ణయం తీసుకుంది. ప్రపంచంలోనే అతి పెద్ద స్టేడియంగా పేరు తెచ్చుకున్న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ క్రీడా మైదానం ఈ పోటీలకు వేదికగా ఎంపికైంది. నైజీరియాలోని అబూజా నగరంతో పోటీ పడి అహ్మదాబాద్ మెగా క్రీడలను నిర్వహించే ఛాన్స్‌ను దక్కించుకుంది.
నవంబర్ 26న గ్లాస్గోలో జరిగే కామన్‌వెల్త్ గేమ్స్ ప్రత్యేక వార్షిక సమావేశంలో ఈ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు. కాగా, ఢిల్లీ తర్వాత ఈ పోటీలకు ఆతిథ్యం ఇస్తున్న నగరంగా అహ్మదాబాద్ అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. ఇంగ్లండ్, కెనడా, భారత్, పాకిస్థాన్, ఆస్ట్రేలియాలతో సహా గతంలో ఆంగ్లేయుల పాలనలో ఉన్న దేశాలు ఈ పోటీల్లో పాల్గొనడం అనవాయితీగా వస్తోంది. కొన్నేళ్లుగా జరుగుతున్న కామన్‌వెల్త్ గేమ్స్‌లో భారత్ అసాధారణ ఆటతో పతకాల పంట పండిస్తోంది. ఇక సొంత గడ్డపై జరిగే క్రీడల్లో మరింత మెరుగైన ప్రదర్శన చేయడం ఖాయం.