– Advertisement –
రెడ్ క్రాస్ కమిటీ వద్దకు మరో 45 పాలస్తీనియన్ల మృతదేహాలు
కండ్లకు గంతలు, చేతులు, కాళ్లు కట్టేసిన వైనం
అరకొరగానే ఆహారం, తాగునీరు
గాజా : కాల్పుల విరమణ అమల్లో వున్నా పాలస్తీనియన్లకు కాల్పుల బాధ తప్పడం లేదు. చెదురు మదురుగా ఇజ్రాయిల్ ఆర్మీ కాల్పులకు పాల్పడుతూ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తునే వుంది. ఖాన్ యూనిస్ నగరానికి తూర్పుగా షేక్ నాజర్ ప్రాంతంలో, బని సుహెలా పట్టణంలో పాలస్తీనియన్లను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయిల్ ట్యాంకులు కాల్పులకు పాల్పడ్డాయని మీడియా వర్గాలు తెలిపాయి. మరోవైపు ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌లోని తమున్ పట్టణంలోకి ఇజ్రాయిల్ బలగాలు చొచ్చుకు వెళ్ళాయి. ఆ ప్రాంతమంతా సోదాలు జరుపుతూ మిలటరీ బుల్డోజరుతో సైడ్‌రోడ్లను శిధిలంచేసి ఆ దారిని మూసివేశారని స్థానికులు తెలిపారు. కాగా, మంగళవారం నాటి కాల్పుల్లో మృతుల సంఖ్య 9కి పెరిగిందని గాజా ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి.
మరోపక్క ఇజ్రాయిల్ జైళ్ళలో మగ్గుతూ మరణించిన ఖైదీల మృతదేహాలను ఇజ్రాయిల్ అప్పగిస్తోంది. తాజాగా 45మృతదేహాలను రెడ్‌క్రాస్ కమిటీకి అందచేసింది. దీంతో ఇప్పటివరకు మొత్తంగా 90 మృతదేహాలు అందాయని గాజా ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ మృతదేహాల్లో కొన్నింటికి కండ్లకు గంతలు కట్టి వున్నాయని, మరికొన్ని చేతులు, కాళ్ళు కట్టివేసి వున్నాయని వైద్య వర్గాలు తెలిపాయి. బహుశా జైళ్లలో ఉరిశిక్షలు అమలు చేసి వుండవచ్చని డాక్టర్లు మీడియాకు తెలిపారు. వందలు వేల సంఖ్యలో నిర్వాసితులు తిరిగి వస్తున్నా ఇక్కడ వారికి తల దాచుకునేందుకు ఒక్క ఇల్లు కూడా కనిపించడం లేదు. కేవలం రాళ్ళ గుట్టలు మాత్రమే అక్కడ మిగిలాయి.
గాజాలోని అన్ని క్రాసింగ్స్‌ను తెరిచి, తక్షణమే మానవతా సాయం పెద్ద మొత్తంలో అందేలా చూడాలని గాజా ప్రభుత్వ మీడియా కార్యాలయ డైరెక్టర్ జనరల్ ఇజ్రాయిల్‌ను కోరారు. ఈ మేరకు అమెరికా, ఇజ్రాయిల్‌పై ఒత్తిడి పెంచాలన్నారు. కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన వెంటనే పెద్ద సంఖ్యలో ప్రజలు ఇక్కడకు వస్తున్నారని,కానీ వారు తినడానికి గానీ తాగడానికి గానీ ఇక్కడ ఏమీ వుండడం లేదని, అందువల్ల ఆహారం, తాగునీరు అందే విషయంలో తక్షణ చర్యలు అవసరమని ఆయన పేర్కొన్నారు. ఒప్పందం కుదిరి దాదాపు వారం కావస్తున్నా ఇజ్రాయిల్ ఇప్పటికీ పరిమిత సంఖ్యలో ఆహార ట్రక్కులను అనుమతిస్తోంది. కేవలం 300ట్రక్కులను మాత్రమే అనుమతిస్తామని ఐక్యరాజ్య సమితికి తెలిపింది. అయితే కనీసం 600ట్రక్కులు పంపాలని ట్రంప్ ప్రణాళిక ప్రకారం అంగీకారం కుదిరింది. హమాస్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోందని, ఇంకా 20 మృత దేహాలు గాజాలోనే వున్నాయని ఇజ్రాయిల్ అధికారులు తెలిపారు.
ఇజ్రాయిల్ నిర్బంధంలోనే కమల్ అద్వాన్ ఆస్పత్రి చీఫ్ అబు సఫియా
గాజా కాల్పుల విరమణ ఒప్పందం ప్రకారం.. గాజాలో ఆస్పత్రులపై దాడి సమయంలో బంధించిన డజనుకి పైగా వైద్యులు, నర్సులు, పారామెడిక్స్ మరియు ఇతర వైద్య సిబ్బందిని ఇజ్రాయిల్ విడుదల చేసింది. అయితే ఆస్పత్రి డైరెక్టర్, చిన్న పిల్లల వైద్యులు హోసం అబు సఫియాను మాత్రం ఇప్పటికీ బందీగానే ఉన్నారు. ఇజ్రాయిల్ ముట్టడి, బాంబుదాడుల్లో గాయాలైన బాధితులకు చికిత్స కొనసాగిస్తూ.. ప్రముఖంగా నిలిచారు. ఉత్తర గాజాలోని కమల్ అద్వాన్ ఆస్పత్రి డైరెక్టర్ అయిన అబూ సఫియాను సుమారు పదినెలలుగా ఎటువంటి ఆరోపణలు లేకుండా బంధించింది.
ఇజ్రాయిల్ నిర్బంధించిన వారి జాబితాలో 31మంది వైద్యులు, నర్సులతో సహా 55 మంది వైద్య సిబ్బంది ఉన్నారని గాజా నుండి ఇజ్రాయిల్ బంధీలుగా తీసుకున్న వారిని నమోదు చేసే హెల్త్ వర్కర్స్ వాచ్ పేర్కొంది. అయితే వారంతా విడుదలయ్యారని వెంటనే నిర్థారించలేమని తెలిపింది.
సుమారు 115మంది వైద్య సిబ్బంది కస్టడీలోనే ఉన్నారని, అలాగే ఇజ్రాయిల్ జైళ్లలో మరణించిన నలుగురి అవశేషాలు ఉన్నాయని ఆ బృందం తెలిపింది. హక్కుల సంఘాలు, సాక్షులు దుర్వినియోగం గురించి నివేదించారు. అబు సఫియా విడుదల అవుతారా లేదా అన్న అంశంపై స్పష్టత లేదని తెలిపింది. ఈ అంశంపై ఇజ్రాయిల్ స్పందించాల్సి వుంది. వైద్యుని విడుదల గురించిన వివరాలు ఏవని ఆయన కుటుంబసభ్యులు పేర్కొన్నారు. ఆయన ఆరోగ్యంపై ఆందోళన చెందుతున్నట్లు తెలిపారు. అయితే అబు సఫియా హమాస్‌కు సహకరించారని లేదా వారికోసం పనిచేశారనే అనుమానంపై దర్యాప్తు చేస్తున్నట్లు ఇజ్రాయిల్ సైన్యం తెలిపింది. జబాలియా, బీట్ లాహియా మరియు బీట్ హనౌన్ పరిసర జిల్లాల్లో జరిగిన దాడిలో ఇజ్రాయిల్ సైన్యం 85రోజుల పాటు కమల్ అద్వాన్ ఆస్పత్రిని ముట్టడించింది. ఆ సమయంలో అబు సఫియా ఆస్పత్రికి నాయకత్వం వహించారు.
శిధిలాల గుండా రోగులను తరలించడంపై ఆయన ఇజ్రాయిల్ దళాలను నిలదీసేందుకు వారి వాహనం వైపు వెళుతున్న దృశ్యాలు సోషల్‌మీడియాలో కనిపించాయి. అనంతరం అబుసఫియా, రోగులు సహా సిబ్బందిని ఖైదీలుగా ఇజ్రాయిల్ నిర్బంధించింది. ఆయన చివరి క్షణం వరకు ఆస్పత్రిలోనేఉన్నారని, తాను వెళ్లిపోతే వైద్య సంరక్షణ సేవలు కుప్పకూలుతాయని ఆందోళన చెందారని గాజా నగరంలోని పేషెంట్స్ ఫ్రెండ్స్ హాస్పిటల్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ సయీద్ పేర్కొన్నారు. ఆయన చాలా గొప్ప వ్యక్తి అని ప్రశంసలు కురిపించారు. ఆయనతో పనిచేసిన సిబ్బంది సహా అంతర్జాతీయ బృందాలు ఈ వాదనను ఖండించాయి. 2023 నవంబర్‌లో ఇజ్రాయిల్ సైన్యం గాజా నగరంలోని షిఫా ఆస్పత్రి డైరెక్టర్ డా.మొహమ్మద్ అబు సెల్మియాను హమాస్ అధికారిగా ప్రకటించి నిర్బంధించింది. అయితే ఏడు నెలల అనంతరం ఆయనను విడుదల చేసింది. అబు సఫియాను కూడా విడుదల చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
2023 ఏడాది చివరలో ఉత్తర గాజాలోని ఆస్పత్రిపై జరిగిన దాడిలో నిర్బంధించబడిన అల్-అవ్దా ఆస్పత్రి డైరెక్టర్ అహ్మద్ మున్నాను సోమవారం విడుదల చేసింది. ఇజ్రాయిల్ 22 నెలలుగా ఆయనను నిర్బంధించింది. ”అల్-అవ్దా ఆస్పత్రి పునరుద్ధరించబడుతుంది. సిబ్బంది తమ చేతులతో పునర్నిర్మిస్తారు. ఆస్పత్రి పునర్నిర్మాణంపై గర్వపడుతున్నాము ” అని ముహన్నా తన సోషల్‌మీడియా పోస్ట్‌లో పేర్కొన్నారు. జబాలియా శరణార్థి శిబిరంలో పలు దాడుల కారణంగా దెబ్బతిన్న అల్ అవ్దా ఆస్పత్రి, ఇజ్రాయిల్ దాడి అనంతరం మే నెల నుండి మూతపడింది.
ఇజ్రాయిల్ రెండేళ్లపాటు నిర్వహించిన దాడుల్లో గాజా ఆరోగ్య వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. సరఫరా కొరత మధ్య బాంబుదాడుల్లో గాయపడిన వారికి చికిత్స చేయడానికి సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చాలావరకు ఆస్పత్రులు మూతపడ్డాయి. ఆస్పత్రులపై దాడులు చేసిన ఇజ్రాయిల్ సైన్యం వందలాది మంది సిబ్బందిని అదుపులోకి తీసుకుంది.
– Advertisement –