కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు వేశారు. కాళేశ్వరం వ్యవహారంలో కేసీఆర్ బద్నాం కావడానికి బీఆర్ఎస్ కీలక నేతలే ముఖ్యకారణమని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి హరీష్ రావు వల్లే జరిగిందని, అందుకే రెండో సారి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఇరిగేషన్ మంత్రి పదవి నుంచి హరీష్ రావును తప్పించారని కవిత విమర్శలు గుప్పించారు. హరీష్ రావు, సంతోష్ రావు, మెగా కృష్టారెడ్డి చేసిన అవినీతి కారణంగా కేసీఆర్‌కు చెడ్డ పేరు వచ్చిందని.. కాళేశ్వరం ప్రాజెక్టులోపై పీసీ ఘోష్ ఇచ్చిన రిపోర్టు ఆధారంగా.. మా నాన్నపై సీబీఐ ఎంక్వైరీ వేశారని తెలిసి కడుపు రగిలిపోయిందని అన్నారు. “కేసీఆర్ పక్కన ఉన్నవారి వల్లే ఇదంతా జరిగింది”. హరీష్ రావు, సంతోష్ రావు వల్లనే కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు జరిగాయయన్నారు. హరీష్ రావు వెనుక రేవంత్ రెడ్డి ఉన్నారని సంచలన ఆరోపణలు చేశారు. “కేసీఆర్ మీద సీబీఐ దర్యాప్తు వేశాక పార్టీ ఉంటే ఏంటి? లేకపోతే ఏంటి? ఇది నా తండ్రి పరువునకు సంబంధించింది. నా లేఖ బయటకు వచ్చినా నేను ఎవరి పేర్లు బయటపెట్టలేదు. రేవంత్‌రెడ్డి ప్రీ-ప్లాన్డ్గా సీబీఐ పేరు చెప్పారు.”అని కవిత ఆరోపించారు.
ట్రోల్ చేస్తే తోలు తీస్తా
తనపై హరీశ్‌రావు, సంతోష్‌రావులు చాలా కుట్రలు చేశారని కవిత ఆరోపించారు. “నేను ఎంపీగా ఉన్నప్పుడు కూడా ఎన్ని కుట్రలు చేసినా భరించాను. హరీశ్‌రావు, సంతోష్‌రావు వెనుక రేవంత్ రెడ్డి ఉన్నారు. దగ్గర ఉండి అవినీతి అనకొండలు కేసీఆర్‌ను బద్నాం చేస్తున్నారు” అని కవిత పేర్కొన్నారు. తనపై సోషల్ మీడియాలో ట్రోల్ చేసే వారిని హెచ్చరిస్తూ, “నాది కేసీఆర్ రక్తం. నేను స్వతంత్రంగా ఉంటాను. నాపై సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తే మీ తోలు తీస్తా. కేసీఆర్ హిమాలయ పర్వతం లాంటి వారు. ఆయనకు అవినీతి మరక అంటితే బాధగా ఉంది. నాకు పెళ్లి చేసేందుకు కూడా మా నాన్న ఆర్థిక ఇబ్బంది పడ్డారు. దేవుడి లాంటి నా తండ్రిపై సీబీఐ దర్యాప్తుకు ఆదేశిస్తే నాకు బాధగా ఉండదా? కేసీఆర్‌ని నిన్న అన్ని మాటలు అంటుంటే, ఒక్కరు కూడా నోరు విప్పకపోవడం ఏంటి?” అని కవిత తీవ్రస్థాయిలో హెచ్చరించారు. వీళ్లు సొంత వనరులు,ఆస్తులు పెంచుకోవడం కోసం ఇలా చేశారు. దమ్ముంటే హరీష్‌రావు,సంతోష్‌రావులపై చర్యలు తీసుకోవాలని కవిత సవాల్ విసిరారు.