Site icon Desha Disha

హైదరాబాద్ లో నేటి నుంచి ఫీవర్ సర్వే..

హైదరాబాద్ లో నేటి నుంచి ఫీవర్ సర్వే..

హైదరాబాద్ లో నేటి నుంచి ఫీవర్ సర్వే..

ఉత్తర్వులు జారీచేసిన జీహెచ్‌ఎంసి హెల్త్ విభాగం
సీజనల్ డిసీస్ ప్రబలకుండా ముందస్తు చర్యలు
ప్రత్యేక క్యాంప్‌లు నిర్వహించేందుకు ఏర్పాట్లు

మనతెలంగాణ సిటీ బ్యూరో ః హైదరాబాద్ మహానగరంలో అంటు వ్యాధులు ప్రబలకుండా జీహెచ్‌ఎంసీ ముందస్తు చర్యలకు శ్రీకారంచుట్టింది. కొద్ది రోజులుగా గ్రేటర్ హైదరాబాద్ మహానగరంలో తరుచూ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఫీవర్ సర్వే చేపట్టాలని జీహెచ్‌ఎంసి కమిషనర్ కర్ణన్ నిర్ణయించారు. వర్షాల సందర్భంగా ప్రత్యేకంగా పారిశుద్ధ్యంపై ఈపాటికే రెండుమార్లు స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన జీహెచ్‌ఎంసీ ఇపుడు ప్రజల్లో అంటువ్యాధులు ప్రబలకుండా, వ్యాధులుసోకే అవకాశామున్న ప్రాంతాలను గుర్తించేందుకు నేటి(శనివారం) నుంచి గ్రేటర్ వ్యాప్తంగా ‘ఫీవర్ సర్వే’ను నిర్వహించేందుకు సిద్దమైంది. ఈ ఫీవర్ సర్వేలో భాగంగా సర్కిళ్ల వారీగా విధులు నిర్వహిస్తున్న మెడికల్ ఆఫీసర్లు తమ సర్కిళ్ల పరిధిలో దోమలతో సోకే మలేరియా, డెంగ్యూ, బోధకాలు వంటి వ్యాధులను ముందుగానే గుర్తించాలని నిర్ణయించింది. దోమలు విపరీతంగా ఉన్న ప్రదేశాలు, జ్వరాలు ప్రబలుతున్న ప్రాంతాల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని జీహెచ్‌ఎంసి ప్లాన్ చేసింది.

ప్రత్యేక ఆదేశాలు..
అవసరమైన చోట్లలో ప్రజలకు అవగాహన కల్పించడం, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం వంటి విషయాలపై కార్యక్రమాలను చేపట్టాలని భావిస్తుంది. మెడికల్ క్యాంప్ లు నిర్వహించేందుకు గత శుక్రవారం జీహెచ్‌ఎంసీ హెల్త్ వింగ్ ప్రత్యేక సర్క్యులర్ జారీ చేసింది. ఈ ఫీవర్ సర్వేలో భాగంగా జీహెచ్‌ఎంసీ అన్ని సర్కిళ్లలోని మురికివాడలు, బస్తీల్లో డోర్ టూ డోర్ వెళ్లి డెంగ్యూ, మలేరియా, సీజనల్ వ్యాధులకు సంబంధించిన అనుమానాస్పదమైన లక్షణాలున్న వారిని గుర్తించి, వారికి ముందస్తుగా వైద్య పరీక్షలు నిర్వహించి, చికిత్స కోసం బస్తీ దవాఖానాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు ప్రభుత్వ ఆసుపత్రులకు రిఫర్ చేయనున్నారు. ముఖ్యంగా సిటీలో మలేరియా ప్రభావం ఎక్కువగా లేకపోవటంతో ప్రధానంగా స్వల్ప అనారోగ్య లక్షణాలు కనిపిస్తున్న వారికి సైతం వైద్య పరీక్షలు నిర్వహించాలని ఉన్నతాధికారులు సర్కిల్ స్థాయి మెడికల్ ఆఫీసర్లకు ఆదేశాలు జారీ చేశారు.

ఈ రెండు నెలలే కీలకం
వర్షపాతం అధికంగా నమోదయ్యే సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లోనే అంటువ్యాధులు ప్రబలుతాయని, వాటి నివారణపై జీహెచ్‌ఎంసీ ప్రత్యేకంగా ఫోకస్‌పెట్టింది. గడిచిన మూడేళ్లలో ఈ రెండు నెలల వ్యవధిలోనే వర్షం కురిసిన తర్వాత రోడ్లపై ఏర్పడే నీటి నిల్వల వల్ల దోమలు వృద్ధి చెంది, వాటి కాటు కారణంగా ప్రజలు డెంగ్యూ వ్యాధుల బారిన పడుతున్నట్లు గుర్తించారు. ఎంటమాలజీ విభాగం ఆధ్వర్యంలో రోజుకి రెండుసార్లు ఫాగింగ్ నిర్వహించటంతో పాటు దోమలను గుడ్డు దశలోనే లార్వను ధ్వంసం చేసేందుకు యాంటీ లార్వా ఆపరేషన్ ప్రక్రియను కూడా నిర్వహించే విషయంపై ప్రత్యేకంగా దృష్టి సారించనున్నారు. డోర్ టూ డోర్ ఫీవర్ సర్వే కోసం జీహెచ్‌ఎంసీలో ప్రస్తుతమున్న ఆశా వర్కర్లు, అంగన్ వాడీ వర్కర్లతో పాటు స్వయం సహాయక బృందాల సహాయం కూడా తీసుకోవాలని ఉన్నతాధికారులు మెడికల్ ఆఫీసర్లకు సూచించినట్లు సమాచారం. ఎక్కడైనా సీజనల్ వ్యాధులు సోకుతున్నట్టు లక్షణలాలు కనిపిస్తే ఆ ఇండ్ల చుట్టు పక్కలనున్న యాభై ఇండ్లలోని కుటుంబాలకు వ్యాధులు ప్రబలకుండా ఈ ఫీవర్ సర్వే నిర్వహించి, నివారణ చర్యలను చేపట్టనున్నారు.

నెల రోజుల్లోనే 303 డెంగ్యూ కేసులు
జీహెచ్‌ఎంసీ పరిధిలోని 30 సర్కిళ్లలో ఒక ఆగస్టు నెలలోనే 303 డెంగ్యూ కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. గత సంవత్సరం ఇదే ఆగస్టు మాసంలో 787 కేసులు నమోదు కాగా, చికున్ గున్యా ఒక కేసు నమోదైంది. అంటు వ్యాధులు ప్రబలేందుకు కీలకంగా భావిస్తున్న సెప్టెంబర్ మాసం 2024లో 604, అక్టోబర్ లో 337 డెంగ్యూ కేసులు, ఇదే రెండు నెలల్లో చికున్ గున్యా కేసులు కూడా భారీగానే నమోదయ్యాయి. సెప్టెంబర్ లో 73, అక్టోబర్ లో 25 చికున్ గున్యా కేసులు నమోదయ్యాయి. గత సంవత్సరం పొడువున మొత్తం 88 చికున్ గున్యా, ఈ సంవత్సరం ఆగస్టు చివరి కల్లా మొత్తం 664 డెంగ్యూ కేసులు నమోదైనట్లు రికార్డులు చెబుతున్నాయి. ఈ సంఖ్య మున్ముందు పెరగకుండా ఉండేలా నియంత్రించేందుకే జీహెచ్‌ఎంసీ శనివారం నుంచి ఫీవర్ సర్వేను మొదలుపెట్టనున్నట్లు తెలిసింది.

Exit mobile version