Site icon Desha Disha

రోగులను పరీక్షిస్తుండగా గుండెపోటు.. కార్డియాక్‌ సర్జన్‌ మృతి

రోగులను పరీక్షిస్తుండగా గుండెపోటు.. కార్డియాక్‌ సర్జన్‌ మృతి

నవతెలంగాణ – హైదరాబాద్: హృద్రోగ బాధితులకు చికిత్స చేసి ప్రాణాలు కాపాడే వైద్యుడు అదే గుండెపోటుతో మరణించాడు. ఆసుపత్రిలో రోగులను పరీక్షిస్తూ ఒక్కసారిగా కుప్పకూలాడు. ఆయనను కాపాడేందుకు తోటి వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. తమిళనాడులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో సేవలందిస్తున్న యువ వైద్యుడు బుధవారం రాత్రి కన్నుమూశాడు. ఓ కార్డియాక్ సర్జన్ గుండెపోటుతో చనిపోవడంపై వైద్యవర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. వివరాల్లోకి వెళితే.. చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో డాక్టర్ గ్రాడ్లిన్‌ రాయ్‌ (39) కార్డియాక్‌ సర్జన్‌ గా సేవలందిస్తున్నారు. బుధవారం రాత్రి ఆసుపత్రిలో విధుల్లో ఉన్నారు.

హృద్రోగ వార్డులోని పేషెంట్లను పరీక్షిస్తుండగా రాయ్ గుండెపోటుకు గురయ్యారు. అకస్మాత్తుగా కుప్పకూలిన డాక్టర్ రాయ్ ను వెంటనే ఐసీయూకు తరలించి చికిత్స అందించినా ఫలితం లేకపోయిందని.. గ్రాడ్లిన్‌ రాయ్‌ ప్రాణాలు కోల్పోయారని ఆసుపత్రి అధికారులు తెలిపారు. హృద్రోగాలపై పూర్తి అవగాహన కలిగిన కార్డియాక్ సర్జన్ అదే గుండెపోటుతో మరణించడంపై వైద్య వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. గ్రాడ్లిన్‌ రాయ్‌కు ఎలాంటి అనారోగ్య సమస్యలు కూడా లేవని ఆయన సహచర వైద్యుడు సుధీర్‌ కుమార్‌ పేర్కొన్నారు. వైద్యులు రోజుకు 12-18 గంటలు పనిచేయాల్సి వస్తుందని, అందువల్ల వారిపై ఒత్తిడి అధికంగా ఉంటుందని అన్నారు. రాయ్ మరణానికి ఇదే కారణమై ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు.

The post రోగులను పరీక్షిస్తుండగా గుండెపోటు.. కార్డియాక్‌ సర్జన్‌ మృతి appeared first on Navatelangana.

Exit mobile version