Site icon Desha Disha

భారత్‌తో చర్చలకు మేం రెడీ…

భారత్‌తో చర్చలకు మేం రెడీ…

మరోసారి ప్రకటించిన పాకిస్థాన్
భారత్‌తో చర్చలు జరిపేందుకు తాము సిద్ధంగా ఉన్నామని పాకిస్థాన్ మరోసారి ప్రకటించింది. కశ్మీర్‌ సహా అపరిష్కృతంగా ఉన్న అన్ని వివాదాలపై గౌరవప్రదమైన రీతిలో సమగ్ర చర్చలకు సిద్ధమని పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ తెలిపారు. ఇస్లామాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ దీర్ఘకాలిక వైఖరికి అనుగుణంగానే ఈ ప్రతిపాదన చేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.ఇరు దేశాల మధ్య సమగ్ర చర్చల ప్రక్రియ 2003లో జనరల్ పర్వేజ్ ముషార్రఫ్ హయాంలో ప్రారంభమైంది. అయితే, 2008లో జరిగిన ముంబై ఉగ్రదాడుల తర్వాత ఈ ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయింది. అప్పటి నుంచి ఇరు దేశాల మధ్య పూర్తిస్థాయి చర్చలు జరగలేదు. పాకిస్థాన్ నుంచి ఇలాంటి ప్రతిపాదనలు రావడం ఇదే మొదటిసారి కాదు. గతంలో ప్రధాని షెహబాజ్ షరీఫ్, మాజీ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో కూడా భారత్‌తో చర్చల ఆవశ్యకతను నొక్కిచెప్పారు. కశ్మీర్, జలవివాదాలతో పాటు వాణిజ్యం, ఉగ్రవాదం వంటి అంశాలపై చర్చలకు తాము సిద్ధమని షెహబాజ్ గతంలో పేర్కొన్నారు. అయితే, చర్చల విషయంలో భారత్ తన వైఖరిని ఎప్పటినుంచో స్పష్టంగా చెబుతోంది. పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)ను తిరిగి అప్పగించడం, ఉగ్రవాదాన్ని అంతం చేయడం అనే రెండు అంశాలపై మాత్రమే పాకిస్థాన్‌తో చర్చలు జరుపుతామని తేల్చిచెప్పింది. సీమాంతర ఉగ్రవాదాన్ని పాకిస్థాన్ ప్రోత్సహించడం ఆపేంత వరకు పూర్తిస్థాయి చర్చలు సాధ్యం కావని భారత్ దృఢంగా విశ్వసిస్తోంది. ఇదే సమయంలో తమ చురుకైన దౌత్యనీతి ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా పాకిస్థాన్ వాదనకు ఆమోదం లభిస్తోందని ఇషాక్ దార్ వ్యాఖ్యానించారు. మొత్తానికి పాకిస్థాన్ నుంచి చర్చల ప్రతిపాదనలు పదేపదే వస్తున్నప్పటికీ, ఉగ్రవాదంపై కఠిన చర్యలు తీసుకునే వరకు ముందుకు వెళ్లేది లేదని భారత్ స్పష్టం చేస్తూ వస్తోంది.

The post భారత్‌తో చర్చలకు మేం రెడీ… appeared first on Visalaandhra.

Exit mobile version