మెదక్, ఆగస్ట్ 30: పేదరికం అతడిని ఊరొదిలి పొమ్మంది. కుటుంబానికి ఆసరాగా ఉందామని అతడు కూడా తలొంచి.. దేశం కాని దేశం వెళ్లాడు. అయితే అలా వెళ్లిన వాడు 13 ఏళ్లు గడుస్తున్నా.. సొంతూరిలోని అయినవారికి ఒక్కసారి కూడా మళ్లీ కనిపించలేదు. కనీసం ఫోన్ కూడా లేదు. నకిలీ ఏజెంట్ల వల్లోపడి మోసపోయి 13 ఏళ్లు అక్కడే రోడ్లపై బిచ్చమెత్తుకుంటూ జీవించాడు. ఇటీవల ఓ వ్యక్తి సాయంతో తిరిగి సొంత గూటికి చేరాడు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం ఉప్పులింగాపూర్ గ్రామానికి చెందిన కోనింటి కృష్ణ ఉదంతం ఇదీ..
ఉప్పులింగాపూర్ గ్రామానికి చెందిన కోనింటి కృష్ణ కూలిపనులు చేసుకొని కుటుంబాన్ని పోషించుకునే వాడు. కృష్ణకు భార్య లక్ష్మి, ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. 13 ఏళ్ల క్రితం అప్పు చేసి ఓ నకిలీ ఏజెంట్ ఉచ్చుతో చిక్కుకుని దుబాయ్‌లో పని చేయడానికి వెళ్లాడు. అయితే అక్కడ కొన్నిరోజులకే ఉద్యోగం ఇచ్చిన పరిశ్రమ నిర్వాహకుల అసలు రంగు తెలిసింది. రోజుకో రకంగా ఇబ్బందులు గురి చేయసాగారు. దీంతో అక్కడి నుంచి పారిపోయాడు. అప్పటి నుంచి దుబాయ్ వీధుల్లోనే భిక్షాటన చేస్తూ కడుపు నింపుకోసాడు. ఎవరినైనా సహాయం కోరుదామంటే అక్కడి వారి భాష కృష్ణకు తెలియదు. దీంతో సొంతూరిలోని కుటుంబ సభ్యులకు కూడా ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వలేకపోయాడు. దేశం కాని దేశంలో ఉద్యోగం కోసం వెళ్లిన భర్త ఏమైయ్యాడో తెలియని లక్ష్మి కూలి పనులు చేసుకుంటూనే పిల్లలిద్దరినీ పెద్ద చేసింది. తాజాగా కుమార్తెకు పెళ్లి కూడా చేసింది. ఈ క్రమంలో నెల రోజుల క్రితం భర్త కృష్ణ ఆచూకీపై ఆమెకు సమాచారం అందడంతో సంతోషానికి అవధులు లేకుండా పోయింది.
ఇవి కూడా చదవండి
దుబాయ్‌లో ఉంటున్న మెదక్ జిల్లా శివ్వంపేట మండలం గోమారానికి చెందిన హనుమంత్ రెడ్డి అనుకోకుండా ఓ రోజు స్నేహితులతో కలిసి హోటల్‌కు వెళ్లాడు. అక్కడ ఓ వ్యక్తి భిక్షాటన చేస్తూ తెలుగులో మాట్లాడుతూ కన్పించాడు. దీంతో హనుమంత్‌రెడ్డి అతన్ని పిలిచి ఆరా తీయగా అసలు విషయం తెలిసింది. దీంతో ద్రవించిపోయిన హనుమంత్ రెడ్డి వెంటనే ఉప్పులింగాపూర్‌కి చెందిన భారత రాష్ట్ర సమితి వెల్దుర్తి మండల అధ్యక్షుడు భూపాల్‌రెడ్డికి సమాచారం అందించారు. సొంత డబ్బుతో కృష్ణను సొంతూరు పంపే ఏర్పాట్లు చేశాడు. ఈ క్రమంలో శుక్రవారం (ఆగస్ట్ 29) కృష్ణ ఉప్పులింగాపూర్ చేరుకున్నాడు. భార్య పిల్లలను కలుసుకుని కన్నీరుమున్నీరయ్యాడు. నకిలీ ఏజెట్ల ఉచ్చులో పడి విదేశాల్లో ఉద్యోగాల కోసం తనలా ఎవరూ మోసపోకూడదని యువతకు విజ్ఞప్తి చేశాడు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.