నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి హత్యకు జరిగిన భారీ కుట్ర బహిర్గతమైంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎమ్మెల్యే కోటంరెడ్డిని చంపితే డబ్బే డబ్బు అంటూ ఆ వీడియోలో రౌడీషీటర్లు మాట్లాడుకుంటుండడం తీవ్ర సంచలనంగా మారింది. కోటంరెడ్డిని చంపాలని ఐదుగురు రౌడీషీటర్లు మాస్టర్ ప్లాన్ వేసినట్టు పోలీసులు, టీడీపీ శ్రేణులు అనుమానిస్తున్నారు. లేడీ డాన్ నిడిగుంట అరుణ ద్వారా రౌడీ షీటర్లు అవిలేల శ్రీకాంత్, జగదీష్ సహా మరికొందరు రౌడీషీటర్లు పథకం రచించినట్టు కోటంరెడ్డి వర్గీయులు గుర్తించారు. వీడియోతో సహా సాక్ష్యాలు సేకరించారు. వెంటనే స్పందించడంతో కోటంరెడ్డి ప్రాణాలకు ముప్పు తొలగిందని చెబుతున్నారు. ఇటీవల ఆయనపై వైసీపీ సోషల్ మీడియాలో దుష్ప్రచారం జరిగింది. కోటంరెడ్డిని హత్య చేస్తే వచ్చే ఎన్నికల్లో గూడూరు లేదా సూళ్లూరుపేట ఎమ్మెల్యే టికెట్టు ఇస్తామని లేడి డాన్ అరుణకు వైసీపీ కీలక నేత ఒకరు హామీ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. డబ్బుతో ప్రలోభపెట్టి కోటంరెడ్డి అనుచరులను రౌడీషీటర్లు తమవైపు తిప్పుకొనే ప్రయత్నం చేసినట్టు టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. రౌడీషీటర్ల వీడియో రిలీజ్ అంశం తమ దృష్టికి రాలేదని నెల్లూరు ఎస్పీ శ్రీకాంత్ తెలిపారు. ఎమ్మెల్యే కోటంరెడ్డితో మాట్లాడుతాం, ఆయన కోరితే రక్షణ కల్పిస్తామని చెప్పారు. మరోవైపు కోటంరెడ్డి అంశం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం రేపింది. ఏకంగా అధికార పార్టీ ఎమ్మెల్యేను చంపేందుకు రౌడీషీటర్లు కుట్ర పన్నడం.. పోలీసులు, నిఘా వర్గాలు దాన్ని గుర్తించకపోవడం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది.
మద్యం తాగుతూ చంపేందుకు ప్లాన్
తాజాగా బయటికి వచ్చిన వీడియోలో నెల్లూరులోని ఓ హోటల్ లో భేటీ అయిన దాదాపు 7, 8 మంది రౌడీషీటర్లు.. మద్యం సేవిస్తూ మాట్లాడుకుంటున్న మాటలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని హతమార్చితే మనకు డబ్బే డబ్బు అంటూ వారు మాట్లాడుకున్నారు. ఆ వీడియోలో ఉన్న రౌడీ షీటర్లను జగదీష్, మహేష్, వినీత్ సహా మరికొందరు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇందులో ఉన్న జగదీష్.. రౌడీషీటర్ శ్రీకాంత్ ముఖ్య అనుచరుడు అని సమాచారం. దీంతో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హత్యకు ప్లాన్ వెనుక రౌడీషీటర్ శ్రీకాంత్ హస్తం ఏమైనా ఉందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ వీడియో ఇంతకుముందే బయటికి వచ్చినట్లు తెలుస్తుండగా.. ఇది పోలీసులకు ముందే తెలిసిననట్లు ఆరోపణలు వస్తుండగా.. ఎందుకు చర్యలు చేపట్టలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లేడీ రౌడీషీటర్ నిడిగుంట అరుణ ద్వారా రౌడీషీటర్లు అవిలేల శ్రీకాంత్, అతని అనచురుడు జగదీష్ సహా మరికొందరు ఈ హత్యకు ప్లాన్ చేసినట్లు కోటంరెడ్డి అనుచరులు ఆరోపిస్తున్నారు. ఈ వీడియోతో పాటు మరిన్ని సాక్ష్యాలు సేకరించినట్లు తెలుస్తోంది. తాము తక్షణమే స్పందించడంతో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రాణాలకు ఎలాంటి ముప్పు జరగలేదని పేర్కొంటున్నారు. ఇటీవల కోటంరెడ్డిపై వైసీపీ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేశారని పేర్కొంటున్నారు.