Site icon Desha Disha

Project Cheetah : నమీబియా చిరుతలు.. ఇండియాలో కొత్తగా ప్రవర్తిస్తున్నాయి

Project Cheetah : నమీబియా చిరుతలు.. ఇండియాలో కొత్తగా ప్రవర్తిస్తున్నాయి

Project Cheetah : రోమ్ లో ఉంటే రోమాన్ లా మారిపోవాలన్నది సామెత.. అనాదిగా మన భూమ్మీద ప్రకృతి వైపరీత్యాలు, కాలానుగుణంగా మనిషి, జంతువులు తమ అలవాట్లు మార్చుకున్నారు. బతకడం కోసం కొత్త విద్యలు నేర్చారు. ఆయా ప్రాంతాలకు అనుగుణంగా జీవులు తమకు తాముగా మారిపోయాయి. అది భూమ్మీద జీవుల మనుగడకు ఎంతో తోడ్పాటునందించింది. నమీబియా నుంచి ఏరికోరి మన ప్రధాని నరేంద్రమోదీ తీసుకొచ్చిన చిరుతలు ఇప్పుడు ఇండియాలో మారిపోయాయి.. అవును వాటి ప్రవర్తనలో గణనీయమైన ఒక కొత్త మార్పును పర్యావరణ వేత్తలు, అధికారులు గమనించారు. నమీబియా దేశంలోకంటే ఇండియాలోకి వచ్చాక మారిన చిరుతల తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ ఆశ్చర్యకరమైన ఈ అనుకరణ ఇప్పుడు శాస్త్రవేత్తలను సైతం సంభ్రమాశ్చార్యాలకు గురిచేసింది. నమీబియా చిరుతలు ఇండియాలో ఎందుకు మారాయి? వాటి కథేంటో తెలుసుకుందాం.

భారతదేశంలో చిరుతల కొత్త ప్రవర్తన..

భారతదేశంలో ప్రవేశపెట్టబడిన చిరుతలు తమ కొత్త వాతావరణానికి అనుగుణంగా అద్భుతమైన మార్పులు చూపిస్తున్నాయి. ప్రాజెక్ట్ చీతాలో భాగంగా నమీబియా నుంచి తీసుకువచ్చిన చిరుతలు.. ముఖ్యంగా భారతదేశంలో జన్మించిన వాటి కూనలు, నదులను ఈదడం నిపుణులను ఆశ్చర్యపరిచింది. ఇది సాధారణంగా ఆఫ్రికాలో కనిపించని ప్రవర్తన.

– ఆఫ్రికా వర్సెస్ భారతదేశం

ఆఫ్రికాలో చిరుతలు సాధారణంగా నీటి నుంచి దూరంగా ఉంటాయి. నీరు వాటికి ముప్పుగా భావిస్తాయి. ఎందుకంటే ఆఫ్రికా నదులు, కుంటల్లో భీకరంగా మొసళ్లు, ఇతర ప్రమాదకర జంతువులు ఉంటాయి. దీంతో నీటిలోకి దిగితే ఆఫ్రికాలో చిరుతలకు ముప్పు పొంచి ఉంటుంది. బొట్స్వానాలోని ఓకావాంగో వంటి ప్రాంతాల్లో చిరుతలు నీటిని దాటినా.. అవి పెద్దగా ప్రవాహం లేని ప్రాంతాలు మాత్రమే. లోతుగా ఉన్న ఈ నీటి ప్రవాహాన్ని చిరుతలు ఆఫ్రికాలో అసలు దాటవు. ఎందుకంటే మొసళ్లు, ఇతర జంతువుల నుంచి వాటి ప్రాణాలకే ముప్పు ఉంటుంది.

భారతదేశంలో మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో జ్వాల అనే ఆడ చిరుత తన పిల్లలతో కలిసి కునో నదిని ఈదడం గమనించారు. అంతేకాకుండా అది చంబల్ నదిని కూడా దాటినట్లు అధికారులు ధృవీకరించారు. ఇది భారతదేశంలోని నదులు.. పర్యావరణ వ్యవస్థకు అలవాటు పడుతున్నట్లు స్పష్టంగా చూపిస్తుంది. ఎందుకంటే భారత్ లోని నదులు, ఇతర కుంటల్లో మొసళ్ల జాడ ఉండదు. మొసళ్ల జనాభా, అవి ఉండే ప్రాంతాలు చాలా తక్కువ. మొసళ్లు లేవు అని నిర్ధారించుకున్న చిరుతలు భారత్ లోని ప్రవాహాలను దాటడం మొదలుపెడుతున్నాయి. అంటే ఆఫ్రికాలో దాటని ఇవే చిరుతలు ఇండియాలో కొత్తగా ప్రవర్తిస్తూ ఇండియాలోని వాతావరణానికి అనుగుణంగా అవి కూడా మారిపోయాయని.. ఇదో అరుదైన సంఘటన అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

– కొత్త సవాళ్లు.. సానుకూల సంకేతాలు

చిరుతలు నదులను ఈదడం ప్రాజెక్ట్ మేనేజర్లకు కొత్త సవాళ్లను సృష్టిస్తోంది. కునో నది వెడల్పు సుమారు 200 మీటర్లే. అవి దాటడం వల్ల చిరుతలకు ఏం కాదు. కానీ చంబల్ నది వంటి పెద్ద నదులు దాటడానికి ప్రయత్నిస్తే చిరుతలకు ప్రమాదం పొంచి ఉంటుంది. అవి మునిగిపోయే ప్రమాదం ఉంటుంది. దీనిని ఎదుర్కోవడానికి అధికారులు కొత్త జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది.

అయినప్పటికీ నిపుణులు ఈ మార్పును సానుకూలంగా చూస్తున్నారు. అమెరికన్ చిరుత నిపుణురాలు సుసాన్ యానెట్టి ఈ ప్రవర్తనను “ఇండియన్ అడాప్టేషన్”గా అభివర్ణించారు. ఇది సహజ పరిణామంలో ఒక ముఖ్యమైన అడుగు అని ఆమె పేర్కొన్నారు. ఇది ప్రాజెక్ట్ చీతా విజయానికి బలమైన సూచన అని నిపుణులు భావిస్తున్నారు. ఈ అసాధారణ ప్రవర్తన భారతదేశపు విభిన్న పర్యావరణానికి చిరుతలు ఎంత త్వరగా అలవాటు పడుతున్నాయో స్పష్టంగా తెలియజేస్తుంది.

Exit mobile version