Modi GST Reforms: అమెరికా టారిఫ్స్‌ దెబ్బ.. మోదీ జీఎస్టీ సంస్కరణలు ఊరటనిస్తాయా?

Modi GST Reforms: భారత దేశ ఎదుగుదలను అగ్రరాజ్యం అమెరికా ఓర్వలేకపోతోంది. ముఖ్యంగా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు అయితే గుండెల్లో దడ మొదలైంది. దీంతో ఎలాగైనా భారత్‌ను దెబ్బ కొట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఈ క్రమంలోనే అనేక విధాలుగా ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశారు. మోదీని లొంగదీసుకోవాలని భావించారు. కానీ కుదరకపోవడంతో ఇప్పుడు ఆర్థికంగా దెబ్బకొట్టేందుకు టారిఫ్‌లు విధించారు. 50 శాతం టారిఫ్‌ల ప్రభావం భారత ఎగుమతులపై తీవ్రంగా పడింది. అయితే భారత్‌ ఇది తాత్కాలికమే అని భావిస్తోంది. ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తోంది. ఈ క్రమంలో తక్షణ నష్టం జరుగకుండా ప్రధాని నరేంద్ర మోదీ జీఎస్టీ సంస్కరణలు చేపట్టారు. అయితే ఇవి ఏమేరకు ఊరటనిస్తాయి అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.

Also Read: కొత్తలోక చాప్టర్ 1′ ఫుల్ మూవీ రివ్యూ…హిట్టా? ఫట్టా?

భారత ఎగుమతులపై ప్రభావం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ రష్యా నుంచి చమురు కొనుగోళ్ల కారణంగా భారత ఉత్పత్తులపై 50% టారిఫ్స్‌ విధించామని చెప్పారు. అయితే మనకన్నా ఎక్కువ దిగుమతి చేసుకుంటున్న చైనా జోలికిమాత్రం వెల్లడం లేదు. టారిఫ్‌ల ప్రభావంతో భారత్‌లోని టెక్స్‌టైల్స్, ఆభరణాలు, లెదర్, సీఫుడ్‌ వంటి రంగాల్లో సుమారు 60 బిలియన్‌ డాలర్ల ఎగుమతులు దెబ్బతినే ప్రమాదం ఉంది. ఈ రంగాలు శ్రామిక–ఆధారితమైనవి కావడంతో లక్షలాది ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డాయి.

మోదీ దీపావళి గిఫ్ట్‌
ఈ క్రమంలో టారిఫ్స్‌ ప్రభావాన్ని తగ్గించేందుకు మోదీ సర్కారు జీఎస్టీ సంస్కరణలను ప్రకటించింది. రెండు స్లాబుల జీఎస్టీ వ్యవస్థ (5%, 18%)ను ప్రవేశపెట్టి, దీపావళి నాటికి పన్ను భారం తగ్గించనున్నారు. ఈ సంస్కరణలు దేశీయ వినియోగాన్ని పెంచి, జీడీపీని 0.6% ఉత్తేజితం చేయవచ్చని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. అయితే, ఈ చర్యలు ఎగుమతి రంగంలో నష్టాలను పూర్తిగా భర్తీ చేయలేవని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

శ్రామిక రంగాల్లో సంక్షోభం
టారిఫ్‌ల కారణంగా టెక్స్‌టైల్స్, ఆభరణాల వంటి శ్రామిక–ఆధారిత రంగాల్లో ఉద్యోగ నష్టాలు తప్పవు. సూరత్, నోయిడా, తిరుప్పూర్‌ వంటి ఎగుమతి కేంద్రాల్లో లక్షలాది ఉద్యోగాలు ప్రమాదంలో ఉన్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఆర్థికవేత్త సాక్షి గుప్తా జీడీపీ 6% కంటే తగ్గవచ్చని, నిరుద్యోగం పెరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఎన్డీఏ సర్కారు ముందున్న సవాళ్లలో ఎగుమతి నష్టాలను భర్తీ చేయడం, శ్రామిక రంగాలను కాపాడటం, దేశీయ వినియోగాన్ని పెంచడం ప్రధానమైనవి. వాణిజ్య ఒప్పందాల ద్వారా యూరోప్, ఆఫ్రికా, ఆసియా మార్కెట్లలో విస్తరణ, ఎస్‌ఈజెడ్‌ సంస్కరణలు, ఎగుమతి ప్రోత్సాహకాలు అవసరం.

స్వదేశీ ఉద్యమం..
ఇదే సమయంలో మోదీ ‘‘స్వదేశీ’’ ఉద్యమాన్ని ప్రోత్సహిస్తూ, దేశీయ ఉత్పత్తులను కొనుగోలు చేయాలని పిలుపునిచ్చారు. ఈ వ్యూహం దీర్ఘకాలంలో ఆత్మనిర్భర భారత్‌ను నిర్మించగలదు. కానీ తక్షణ ఎగుమతి నష్టాలను భర్తీ చేయడం కష్టం. రష్యాతో వాణిజ్యాన్ని కొనసాగించేందుకు భారత్‌ నిర్ణయం దౌత్యపరమైన సవాళ్లను తెచ్చిపెడుతోంది.

Leave a Comment