Basheerbagh Incident: బషీర్‌బాగ్ కాల్పులు.. తెలంగాణలోనే కాదు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఒక దుర్దినం. 2000, ఆగస్టు 28న జరిగిన ఈ ఘనటకు నేటితో పాతికేళ్లు. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం ప్రభుత్వం విద్యుత్ చార్జీలను భారీగా పెంచింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు భగ్గుమన్నాయి. ఈ నిరసనలు హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్‌లో రక్తసిక్తంగా మారాయి, పోలీసు కాల్పుల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనే మలి దశ తెలంగాణ ఉద్యమానికి కొత్త ఊపిరి పోసింది. >జకీయ, సామాజిక మార్పులకు బీజం వేసింది.
విద్యుత్ చార్జీలపై ప్రజా ఆగ్రహం
1999 చివరలో ప్రపంచ బ్యాంక్ షరతులకు అనుగుణంగా చంద్రబాబు ప్రభుత్వం విద్యుత్ రంగ సంస్కరణల పేరుతో చార్జీలను పెంచింది. ఈ నిర్ణయం సామాన్య ప్రజలపై, ముఖ్యంగా రైతులు, చిన్న వ్యాపారులపై భారీ భారం మోపింది. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు ఉవ్వెత్తున ఎగిశాయి. అప్పటి విపక్ష నాయకుడు వైఎస్.రాజశేఖరరెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ, వామపక్ష పార్టీలు, తెలంగాణ నాయకులు ఈ పెంపును తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ నిరసనలు హైదరాబాద్‌లోని అసెంబ్లీ వద్ద ‘చలో అసెంబ్లీ’ ర్యాలీగా రూపాంతరం చెందాయి.
బషీర్‌బాగ్‌లో పేలిన తూటా..
ఆగస్టు 28, 2000న, ‘చలో అసెంబ్లీ’ నిరసనలో పాల్గొన్న కార్యకర్తలపై పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో సత్తెనపల్లి రామకృష్ణ, బాలస్వామి, విష్ణువర్ధన్‌రెడ్డి ప్రాణాలు కోల్పోయారు. ఈ రక్తపాతం ప్రజలలో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. చంద్రబాబు ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు ఈ ఘటన ఒక చీకటి అధ్యాయంగా నిలిచింది. ఈ సంఘటన తెలంగాణ ప్రజలలో ప్రభుత్వంపై అసంతృప్తిని మరింత పెంచింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌ను బలపరిచింది.
తెలంగాణ ఉద్యమంలో కీలక మలుపు…
బషీర్‌బాగ్ ఘటన తెలంగాణ ఉద్యమంలో ఒక మహత్తరమైన మలుపుగా నిలిచింది. అప్పటి డిప్యూటీ స్పీకర్ కె.చంద్రశేఖర్ రావు (కేసీఆర్), చంద్రబాబు నాయుడు నిర్ణయాలపై అసంతృప్తితో తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. ఈ ఘటన తర్వాత, 2001లో కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) స్థాపించి, ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లారు. ఈ ఘటన తెలంగాణ ప్రజలలో రాజకీయ చైతన్యాన్ని రేకెత్తించి, ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేసింది.
బషీర్‌బాగ్ ఘటన తెలంగాణ ఉద్యమానికి కొత్త ఊపిరి పోసింది. ఈ ఘటన తర్వాత, విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు, వివిధ సామాజిక వర్గాలు ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష, సకల జనుల సమ్మె, మిలియన్ మార్చ్ వంటి వినూత్న నిరసనలు తెలంగాణ ఉద్యమాన్ని ప్రజా ఉద్యమంగా మార్చాయి. ఈ ఘటన చంద్రబాబు ప్రభుత్వానికి కౌంట్‌డౌన్‌ను ప్రారంభించి, 2004 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఓటమికి ఒక కారణంగా నిలిచింది.