ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో బుల్లెట్ రైలు పరుగులు పెట్టేందుకు సిద్ధమవుతోంది. కేంద్ర ప్రభుత్వం ఏపీ మీదుగా హైదరాబాద్ నుంచి చెన్నై, అలాగే హైదరాబాద్ నుంచి బెంగళూరు మధ్య రెండు కొత్త బుల్లెట్ రైలు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ రైళ్లు ఏపీలోని పలు జిల్లాల గుండా వెళ్తాయి. వీటిలో ఒకటి రాజధాని అమరావతి మీదుగా వెళ్లనుండడం విశేషం. ఈ రెండు ప్రాజెక్టులు పూర్తయితే.. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు లాంటి పెద్ద నగరాల మధ్య ప్రయాణ సమయం చాలా తగ్గిపోతుంది. సాధారణంగా గంటల కొద్దీ పట్టే ప్రయాణం కేవలం ఒకటి, రెండు గంటల్లోనే పూర్తవుతుంది.
హైదరాబాద్-చెన్నై వయా అమరావతి
ఈ బుల్లెట్ రైలు మార్గం హైదరాబాద్ నుంచి మొదలై శంషాబాద్, సూర్యాపేట్, ఖమ్మం దాటిన తర్వాత ఏపీలోకి ప్రవేశిస్తుంది. అక్కడ నుంచి అమరావతి, గుంటూరు, చీరాల మీదుగా చెన్నై చేరుకుంటుంది. ఈ మార్గం మొత్తం 744 కిలోమీటర్లు ఉంటుంది. దీనిలో ఆంధ్రప్రదేశ్‌లో అత్యధికంగా 448 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఈ రైలు మార్గంలో తెలంగాణలో ఆరు, ఆంధ్రప్రదేశ్‌లో ఎనిమిది, తమిళనాడులో ఒక స్టేషన్ ఉంటాయి. ఈ రైలు తిరుపతి మీదుగా వెళ్తే భక్తులకు మరింత సౌకర్యంగా ఉంటుంది. దీనికి సంబంధించి చర్చలు సాగుతున్నాయి.
హైదరాబాద్-బెంగళూరు.. వయా కర్నూలు, అనంతపురం
మరొక బుల్లెట్ రైలు మార్గం హైదరాబాద్ నుంచి మొదలై.. చాలావరకు హైదరాబాద్-బెంగళూరు హైవేకి సమాంతరంగా వెళ్తుంది. ఈ మార్గం కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల మీదుగా వెళ్తుంది. ఈ ప్రాజెక్టు మొత్తం 576 కిలోమీటర్లు ఉంటుంది. దీనిలో ఏపీలో 263 కిలోమీటర్ల మార్గం ఉంటుంది.
ఈ మార్గంలో శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ దగ్గర ఉన్న కియా కార్ల కంపెనీ కోసం ప్రత్యేకంగా ఒక స్టేషన్ కూడా ఏర్పాటు చేయబోతున్నారు.
ఈ రెండు ప్రాజెక్టులు పూర్తి అయితే బెంగళూరు నుంచి చెన్నైకి కూడా ఇలాంటి ప్రాజెక్టు వస్తే, ఈ నాలుగు నగరాలు ఒక పెద్ద బుల్లెట్ రైలు నెట్‌వర్క్‌గా అనుసంధానమవుతాయి. దీని వల్ల ప్రయాణం చాలా సులభంగా, వేగంగా మారుతుంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.