American F 35: ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఏ దేశం ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పలేని పరిస్థితి. మొన్నటి వరకు భారత్‌కు మిత్రదేశంగా ఉన్న అమెరికా ఇప్పుడు శత్రువుగా మారింది. ట్రంప్ టారిఫ్‌ల కారణంగా భారత్‌కు దగ్గరైన చైనా.. ఉన్నట్టుండి మళ్లీ మన శత్రువుల పాకిస్తాన్‌తోనూ దోస్తీకి సై అంటోంది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల మధ్య వైరం పెరుగుతోంది. ఇలాంటి పరిస్థితిలో ఆయుధాల వ్యాపారం ఊపందుకుంది. అయితే భారత్ మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్‌లో సొంతంగా ఆయుధాలు సమకూర్చుకుంటోంది. అయితే అమెరికా తన ఆయుధాలు కొనాలని భారత్‌పై ఒత్తిడి చేస్తోంది. ఇలాంటి పరిస్థితిలో అమెరికా యుద్ధ విమానం ఎఫ్–35 లో లోపాటు బయటపడ్డాయి. 2025 జనవరి 28న అలస్కాలోని ఈల్సన్ ఎయిర్ ఫోర్స్ బేస్ వద్ద యుఎస్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన ఎఫ్–35 యుద్ధ విమానం కూలిపోయింది. ఈ ఘటనలో పైలట్ సురక్షితంగా పారాచూట్ ద్వారా భూమిపైకి చేరగా, విమానం నేరుగా భూమిపై కూలి మంటల్లో చిక్కుకుంది. సాంకేతిక లోపం కారణంగా జరిగిన ఈ దుర్ఘటన హైడ్రాలిక్ సిస్టమ్‌లోని సమస్యలు, పొరపాట్లను బయటపెట్టింది.
Also Read: కొత్తలోక చాప్టర్ 1′ ఫుల్ మూవీ రివ్యూ…హిట్టా? ఫట్టా?
లోపాలు బట్టబయలు..
విమానం నోస్, మెయిన్ ల్యాండింగ్ గేర్‌లలోని హైడ్రాలిక్ లైన్లలో మంచు ఏర్పడటం విమానం కూలిపోవడానికి ప్రధాన కారణం. టేకాఫ్ తర్వాత, పైలట్ ల్యాండింగ్ గేర్‌ను రిట్రాక్ట్ చేయడానికి ప్రయత్నించినప్పుడు అది విఫలమైంది. మళ్లీ గేర్‌ను దించడానికి ప్రయత్నించినప్పుడు, నోస్ గేర్ ఎడమవైపు వంగి లాక్ అయింది. ఈ సమస్య విమాన సెన్సార్‌లను గందరగోళానికి గురిచేసి, విమానం భూమిపై ఉన్నట్లు తప్పుగా సూచించింది. దీంతో విమానం నియంత్రణ కోల్పోయింది. దుర్ఘటనకు ముందు, పైలట్ లాక్‌హీడ్ మార్టిన్ ఇంజనీర్లతో సుమారు 50 నిమిషాలపాటు గగనంలో కాన్ఫరెన్స్ కాల్‌లో మాట్లాడాడు. సమస్యను పరిష్కరించేందుకు ఐదుగురు ఇంజనీర్లతో కలిసి చర్చించిన పైలట్, జామ్ అయిన నోస్ గేర్‌ను సరిచేయడానికి రెండు ‘టచ్ అండ్ గో‘ ల్యాండింగ్‌లను ప్రయత్నించాడు. అయితే, ఈ ప్రయత్నాలు విఫలమై, ల్యాండింగ్ గేర్‌లు పూర్తిగా జామ్ అయ్యాయి. ఈ ప్రక్రియలో విమానం నియంత్రించే పరిస్థితి దాటిపోయింది. దీంతో పైలట్ ప్యారాచూట్ సాయంతో దూకేశాడు.
హైడ్రాలిక్ సిస్టమ్‌లోకి నీళ్లు..
విమాన శిథిలాల తనిఖీలో నోస్, రైట్ మెయిన్ ల్యాండింగ్ గేర్‌ల హైడ్రాలిక్ సిస్టమ్‌లో మూడవ వంతు ద్రవం నీరుగా ఉన్నట్లు గుర్తించారు, ఇది అసలు ఉండకూడనిది. ఈ ‘హైడ్రాలిక్ ఐసింగ్‘ సమస్య –18 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో మరింత తీవ్రమైంది. ఆసక్తికరంగా, ఈ దుర్ఘటన తర్వాత తొమ్మిది రోజులకు అదే బేస్‌లో మరొక విమానంలో ఇలాంటి సమస్య తలెత్తినప్పటికీ, ఆ విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది.
ఇక ఎవరూ వాటిని కొనరు..
ఎఫ్–35 జెట్ దుర్ఘటన అత్యాధునిక సాంకేతికత కలిగిన విమానాలలో కూడా సాంకేతిక లోపాలు, మానవ తప్పిదాలు ఎలా వినాశకర పరిణామాలకు దారితీయగలవో తెలియజేస్తుంది. ఈ ఘటన హైడ్రాలిక్ సిస్టమ్‌ల నిర్వహణ, సాంకేతిక సమస్యల పరిష్కారంలో నిర్ణయాధికార ప్రక్రియలు, సరైన పర్యవేక్షణ ప్రాముఖ్యతను గుర్తు చేస్తుంది. దీనికి సంబంధించిన వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో ఇక ఎఫ్–35 విమానలు కొనడానికి ఎవరూ ముందుకు రారు. దీంతో అమెరికా చేసేవన్నీ విఫల ప్రయత్నాలుగానే మిగిలిపోనున్నాయి.