రాత్రి నానబెట్టిన బాదం ఉదయం తింటే ఏమౌతుందో తెలుసా..? – Telugu News | Why You Must Eat Soaked Almonds Every Morning

మనలో చాలా మందికి రాత్రి నానబెట్టిన బాదం పప్పులను ఉదయం తినే అలవాటు ఉంటుంది. కానీ అందరూ ఈ అలవాటును పాటించడం లేదు. నిజానికి బాదం పప్పులు నానబెట్టి తింటే అవి మెదడుకు పదును పెడతాయి, శరీరానికి శక్తిని ఇస్తాయి. రోజుకు 5 బాదం పప్పులు ఒక నెల పాటు క్రమం తప్పకుండా తింటే శరీరంలో స్పష్టమైన మార్పులు కనిపిస్తాయి. నానబెట్టడం వల్ల అవి రుచిగా మారడమే కాకుండా జీర్ణక్రియకు సులభం అవుతాయి. నానబెట్టిన బాదం తినడం వల్ల కలిగే ముఖ్యమైన ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

నానబెట్టి తింటేనే మంచిది

బాదం పప్పులు ఉదయాన్నే తింటే మనసు తేలికగా ఉంటుంది. శరీరానికి శక్తి వస్తుంది. పచ్చిగా తింటే కడుపులో బరువుగా అనిపించవచ్చు. నానబెట్టి తింటే తొక్కలో ఉండే జీర్ణానికి ఆటంకం కలిగించే పదార్థాలు తగ్గుతాయి. కడుపు ఉబ్బరం ఉండదు.

రోజంతా చురుకుదనం

బాదంలో ఉన్న ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్, ఫైబర్ శరీరానికి శక్తిని ఇస్తాయి. మధ్యాహ్నం వచ్చే బద్ధకం తగ్గి రోజంతా ఉత్తేజంగా ఉండేలా చేస్తాయి.

చర్మానికి అద్భుతమైన ఔషధం

బాదం పప్పులో విటమిన్ E సమృద్ధిగా ఉంటుంది. ఇది శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ కాబట్టి చర్మాన్ని కాలుష్యం, సూర్య కిరణాల ప్రభావం నుంచి కాపాడుతుంది. బాదం పప్పులు క్రమం తప్పకుండా తింటే చర్మం మృదువుగా, తేమతో నిండినట్టుగా మారుతుంది.

జ్ఞాపకశక్తికి బూస్టర్

బాదం పప్పులో రిబోఫ్లావిన్, ఎల్-కార్నిటైన్ లాంటి పదార్థాలు మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. ఇవి నరాల ఆరోగ్యానికి తోడ్పడతాయి. పిల్లలు చదువులో ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెంచుకోవడానికి బాదం చాలా సహాయకారి.

గుండె ఆరోగ్యానికి మేలు

బాదం తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గి.. మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఇందులోని మెగ్నీషియం, పొటాషియం రక్తపోటును నియంత్రణలో ఉంచి గుండె జబ్బులను తగ్గిస్తాయి.

అద్భుతమైన స్నాక్

బాదంలో కేలరీలు ఎక్కువగా ఉన్నప్పటికీ.. ఐదు నానబెట్టిన బాదం పప్పులు తింటే కడుపు నిండిన భావన కలుగుతుంది. బరువు తగ్గాలనుకునే వారికి ఇది సహాయకారి. ఇందులోని ఫైబర్, ప్రోటీన్ ఎక్కువగా తినకుండా చేస్తాయి.

ఎముకలకు బలం

కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్ లాంటి ఖనిజాలు బాదంలో ఉంటాయి. ఇవి ఎముకలు, పళ్లను బలంగా ఉంచడంలో సహాయపడతాయి.

మధుమేహ నియంత్రణ

బాదం పప్పుల్లో గ్లైసెమిక్ సూచిక తక్కువగా ఉంటుంది. అందు వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో మేలు చేస్తాయి. మధుమేహ రోగులు వైద్యుల సలహాతో భోజనం తర్వాత కొన్ని బాదం పప్పులు తినవచ్చు.

వాపులను తగ్గించే సూపర్ ఫుడ్

నానబెట్టిన బాదంలో ఉన్న విటమిన్ E, పాలీఫెనాల్స్ శరీరంలోని వాపులను తగ్గించడంలో సహాయపడతాయి. ఇవి కీళ్ల నొప్పులు, గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

[

Leave a Comment