Site icon Desha Disha

దొంగ‌లు అనుకొని స‌ర్వే అధికారుల‌ను కుమ్మేశారు..!

దొంగ‌లు అనుకొని స‌ర్వే అధికారుల‌ను కుమ్మేశారు..!

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ జిల్లాలో గూగుల్ మ్యాప్స్ సర్వే టీమ్‌పై గ్రామస్థులు దాడికి దిగిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. అయితే, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గత కొంతకాలంగా ఈ ప్రాంతంలో రాత్రివేళ కార్లలో వచ్చి దొంగతనాలు చేస్తున్న సంఘటనలు తరచూ జరుగుతున్నాయి. దీంతో గ్రామస్తులు అప్రమత్తంగా ఉండి, పరిచయం లేని వాహనాలను జాగ్రత్తగా గమనిస్తున్నారు.. ఆగస్టు 28వ తేదీన గూగుల్ టీమ్‌ రోడ్డుపై మ్యాపింగ్ కోసం కెమెరా అమర్చిన వాహనంలో సర్వే చేస్తుండగా, అనుమానం వచ్చిన స్థానిక ప్రజలు వారిని అడ్డుకుని.. వారిపై కొంతమంది గ్రామస్థులు దాడి చేశారు. ఇక, సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని, సర్వే టీమ్‌తో పాటు గ్రామస్థులను పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

ఈ సందర్భంగా గూగుల్ మ్యాప్స్ టీమ్ లీడర్ సందీప్ మాట్లాడుతూ.. గ్రామస్థులు మమ్మల్ని అనుమానంతో చుట్టుముట్టారు. మా డాక్యుమెంట్లు చూసి ఉంటే, మమ్మల్ని ఇలా కొట్టేవారు కాదు అని పేర్కొన్నారు. మేము కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అనుమతులతోనే పని చేస్తున్నామని స్పష్టం చేశారు. ఇక, పోలీసులు మాట్లాడుతూ.. గూగుల్ మ్యాప్స్ టీమ్ స్థానిక పోలీసులకు గానీ గ్రామ పెద్దలకు సమాచారం ఇవ్వకుండానే సర్వే ప్రారంభించింది.. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ముందుగా తమకు సమాచారం ఇవ్వాలని సూచించారు. కాగా, ఈ ఘటనపై గూగుల్ టీమ్ ఎటువంటి ఫిర్యాదు చేయకపోవడంతో పోలీసులు కేసు నమోదు చేయలేదు. గ్రామస్థులతో చర్చల అనంతరం వివాదం సర్దుమణిగింది.

The post దొంగ‌లు అనుకొని స‌ర్వే అధికారుల‌ను కుమ్మేశారు..! appeared first on Navatelangana.

Exit mobile version