పదవి నుంచి తొలగిస్తూ రాజ్యాంగ కోర్టు సంచలన తీర్పు
బ్యాంకాక్: థాయ్‌లాండ్ ప్రధాని పెటంగటార్న్ షినవత్రా కు గట్టి షాక్ తగిలింది. ఆ దేశ రాజ్యాంగ కోర్టు ఆమెను పదవినుంచి తొలగిస్తూ శుక్రవారం సంచలన వెలువరించింది. పొరుగుదేశం కంబోడియా ప్రధానితో జరిపిన ఫోన్ సంభాషణపై షినవత్రాపై విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టిన సస్పెండ్ చేస్తూ ఇటీవలే తీర్పు చెప్పింది. తాజాగా ఆమెను పదవి నుంచి తొలగిస్తూ తీర్పునిచ్చింది. ఆమె నియమాలను ఉల్లంఘించారని, రాజ్యాంగం ప్రకారం ప్రధాన మంత్రి పదవికి అనర్హురాలని పేర్కొంది. ఓ ఫోన్ సంభాషణలో కంబోడియా మాజీ అధినేత హున్‌సేన్‌ను ‘అంకుల్’ అని సంబోధించిన షినవత్రా… తమ దేశ సైనిక కమాండర్‌ను తన విరోధి అని పేర్కొనడం వివాదానికి దారితీసింది. దేశ సరిహద్దుల్లో కంబోడియాతో ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలో స్వయంగా ప్రధాని తమ దేశ సైనిక కమాండర్‌కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడంపై ప్రజల్లో ఆగ్రహం పెల్లుబికింది. దీనిపై గత నెల విచారణ చేపట్టిన కోర్టు.. కంబోడియాతో జరిగిన దౌత్య వ్యవహారంలో ప్రధానమంత్రిగా నైతికతను ఉల్లంఘించారని చెప్పడానికి తగిన ఆధారాలున్నాయని స్పష్టం చేసింది. నైతిక ఉల్లంఘనలకు పాల్పడిన 62 ఏండ్ల ప్రధాని స్రెట్టా థావిసిన్ పదవి నుంచి దిగిపోయిన తర్వాత ప్రధాని బాధ్యతల నుంచి సస్పెండ్ అయిన రెండో వ్యక్తిగా షినవత్రా నిలిచారు. షినవత్రాను పదవినుంచి తొలగించడంతో, ఇప్పుడు థాయ్ పార్లమెంట్ కొత్త నాయకుడిని ఎన్నుకోవాల్సి ఉంది. అయితే షినవత్రాకు చెందిన ఫ్యూథాయ్ పార్టీకి పార్లమెంటులో స్వల్ప మెజారిటీ మాత్రమే ఉండటంతో ఈ ప్రక్రియ అంత సులువుగా ముగిసేలా కనిపించడం లేదు. కొత్త ప్రధాని ఎన్నిక పూర్తయ్యే వరకు ఉప ప్రధాని ఫుమ్తామ్ వెచైచాయ్ తాత్కాలిక ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తిస్తారు. ప్రస్తుతానికి ప్రధాని పదవి రేసులో ఫ్యూథాయ్ పార్టీకే చెందిన 77 ఏళ్ల చైకాసెం నితిసిరి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయనతో పాటు మాజీ ప్రధాని, సైనిక నేత ప్రయుత్ చాన్-ఓచా కూడా పోటీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఏడాది క్రితం ఇలాగే రాజ్యాంగ న్యాయస్థానం నాటి ప్రధానిని తొలగించడంతో అనూహ్యంగా ప్రధాని అయిన షినవత్రా, ఇప్పుడు అదే తరహాలో పదవిని కోల్పోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
థాయ్ ప్రధాని షినవత్రాకు షాక్
