Money vs Value: జీవితంలో ఎంత డబ్బు సంపాదించినా కొందరికి తృప్తి ఉండదు. మరికొందరికి తృప్తికరమైన జీవితం ఉంటుంది.. కానీ వారికి డబ్బు ఉండదు. అయితే తృప్తికరమైన జీవితం ఉన్నచోటే విలువ కూడా ఉంటుంది. సమాజంలో గౌరవంగా బతకాలంటే విలువను సంపాదించుకోవాలి. ఒక మనిషికి విలువ ఉండడం వల్ల ఎదుటివారు గౌరవిస్తారు. అలాగే కొన్ని పనులు సులభంగా పూర్తవుతాయి. కమ్యూనికేషన్ పెరుగుతుంది. మరి ఈ విలువ రావడానికి ఏం చేయాలి? ఎక్కడ ఉండాలి? ఇది తెలుసుకోవడానికి ఆసక్తికరమైన ఈ కథనం మీకోసం..
ఒక ఊర్లో ఒక ధనవంతుడైన వ్యాపారి ఉంటాడు. అతనికి ఒక కుమారుడు ఉంటాడు. కుమారుడికి తండ్రి సంపాదించిన ఆస్తి ఎంతో ఉంటుంది. కానీ దాని ద్వారా అతడు తృప్తిగా ఉండలేడు. సమాజంలో తనకు విలువలేదని నిత్యం కృంగిపోతు ఉంటాడు. అయితే తన కొడుకు బాధను చూసిన తండ్రి ఒకరోజు పిలుచుకొని.. ఒక పాత గడియారాన్ని చేతిలో పెడతాడు. ఇది మీ తాతది అని.. దీనికి మార్కెట్లో ఎంత విలువ ఉందో తెలుసుకొని రమ్మని చెబుతాడు. మార్కెట్లోకి వెళ్లిన అతడు చాలామందిని గడియారం ఎంత విలువ ఉంటుంది అని అడుగుతాడు. వీరు. 500 ఉంటుందని చెబుతారు. ఆ తర్వాత ఇంటికి వచ్చిన అతడు తండ్రికి జరిగినది అంతా చెబుతాడు. మరోసారి దీనిని తీసుకెళ్లి గడియారం షాపులోకి వెళ్లి దీని విలువ ఎంతో తెలుసుకొని రమ్మని అంటాడు. ఈసారి వెళ్లి అతడు గడియారం చూపించగా.. ఎంతో ఆశ్చర్యంగా చూసినవారు రూ.5000 ఇస్తామని అంటారు.
ఇంటికి తిరిగి వచ్చిన వ్యాపారి కొడుకు తండ్రికి ఆ విషయం చెబుతాడు. మూడోసారి తనని బంగారం షాపులోకి వెళ్ళమని చెబుతాడు. అప్పుడు ఈ గడియారాన్ని చూసినవారు మరింత సంతోషపడి.. రూ. 50,000 పలుకుతుందని చెబుతారు. ఇదే విషయాన్ని తండ్రితో చెబుతాడు.
అప్పుడు తండ్రి తన కొడుకుతో ఇలా అంటాడు. మనం ఏ వాతావరణంలో ఉంటే మనం కూడా అదేలా మారుతూ ఉంటాం. విలువ కావాలని అనుకునేవారు విలువ కలిగిన వ్యక్తులతో స్నేహం చేయాలి. వారితో కలిసి మెలిసి ఉండాలి. అలాకాకుండా విలువ లేని వారితో ఉండడంవల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. అంతేకాకుండా మనకు విలువ ఇచ్చిన చోటే మనం వారితో కలిసి ఉండాలి. విలువ ఇవ్వనిచోట ఉండకూడదు.. అని కొడుకుతో తండ్రి ఇలా అంటాడు.
ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఇదే విషయం జరుగుతూ ఉంటుంది. ఎంతోమంది తాము ఏదో చేయాలని అనుకుంటూ ఉంటారు. కానీ వారి చుట్టూ ఉన్న మనుషుల ప్రభావం కూడా వారిపై ఉంటుంది. వారికి కావాల్సిన వారితో స్నేహం చేయడం వల్ల అనుకున్నది సాధిస్తారు. అలా కాకుండా వ్యతిరేక భావాలు కలిగిన వారితో ఉండడం వల్ల ఎప్పటికీ ఏది సాధించలేరు. అందువల్ల స్నేహం చేసేటప్పుడు.. కలిసిమెలిసి ఉండేటప్పుడు ఎదుటి వ్యక్తి గురించి పూర్తిగా తెలుసుకునే అవసరం ఉంది. అంతేకాకుండా గౌరవ మర్యాదలు, విలువలు లేని చోట స్నేహం చేయడం.. కలిసిపోవడం ఎప్పటికీ మంచిది కాదు.
[