క్రిప్టో కరెన్సీ పెట్టుబడితో మోసం.. రూ.11.04లక్షలు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు

క్రిప్టో కరెన్సీ పెట్టుబడితో మోసం.. రూ.11.04లక్షలు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు

మనతెలంగాణ, సిటిబ్యూరోః మ్యాట్రీమోనీ వెబ్‌సైట్‌లో పరిచయమైన యువతి క్రిప్టో కరెన్సీ పెట్టుబడి పేరుతో యువకుడిని నిండాముంచింది. బాధితుడి మాటలు నమ్మిన యువకుడు రూ.11,04,000 ఆన్‌లైన్‌లో పంపించి మోసపోయాడు. పోలీసుల కథనం ప్రకారం….పంజాగుట్టకు చెందిన యువకుడు(31) రెడ్డి మ్యాట్రీమోనీలో వివాహం కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. ఈ క్రమంలోనే వాట్సాప్‌లో ఓ యువతి పేరుతో మెసేజ్ వచ్చింది. తాను స్కాట్‌ల్యాండ్‌లో పనిచేస్తున్నట్లు చెప్పింది, తరచూ ఇద్దరు వాట్సాప్‌లో ఛాటింగ్ చేసుకునేవారు.

ఈ క్రమంలో ఇద్దరి మధ్య నమ్మకం పెరగడంతో సైబర్ నేరస్థులు ప్లాన్ అమలు చేశారు. తాను క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెడుతున్నానని, భారీగా లాభాలు వస్తున్నాయని చెప్పింది. రెండు వెబ్ సైట్లు పంపించి వాటి ద్వారా క్రిప్టోలో పెట్టుబడిపెడితే భారీగా లాభాలు వస్తాయని చెప్పింది. ఇది నిజమని నమ్మిన బాధితుడు పలు దఫాలుగా నెట్‌బ్యాంక్ ద్వారా రూ.11,04,000 ట్రాన్స్‌ఫర్ చేశాడు. తర్వాత నుంచి యువతి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో మోసపోయానని గ్రహించాడు. వెంటనే హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Comment