
దిశ, వెబ్ డెస్క్: కేసీఆర్ ప్రవేశపెట్టిన కల్యాణ లక్ష్మి పథకానికి కాంగ్రెస్ ప్రభుత్వం తూట్లు పొడుస్తోందని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. పేదింటి ఆడబిడ్డ పెళ్లి తల్లిదండ్రులకు భారం కాకూడదని కేసీఆర్ ఈ పథకాన్ని తీసుకువచ్చారని చెప్పారు. నెలల తరబడి కళ్యాణ లక్ష్మి దరఖాస్తులను పరిశీలించకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని అన్నారు. తహశీల్దార్ కార్యాలయాల్లోనే 61వేలకు పైగా, అర్హత నిర్దారణ స్థాయిలో 21 వేలకు పైగా దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయంటే పేదల సంక్షేమం పై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏపాటిదో స్పష్టం అవుతోందని చెప్పారు. ఎన్నికల ముందు పేదలు, ఆడబిడ్డలకు ఎన్నో మామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ గద్దెనెక్కిన తరవాత వాటిని పూర్తిగా విస్మరించిందని చెప్పారు. కళ్యాణ లక్ష్మిలో రూ.లక్షతో పాటు తులం బంగారం ఇస్తామని నమ్మించి నయవంచన చేసిందని విమర్శించారు. కనీసం దరఖాస్తులు కూడా పరిశీలించకుండా క్రమేణా కళ్యాణలక్ష్మిని కనుమరుగు చేసే కుట్రకు తెరతీశారని మండిపడ్డారు.