కమ్యూనిస్టు నేత పుచ్చలపల్లి సుందరయ్య మేనల్లుడు సూసైడ్‌..! – Telugu News | Communist leader Puchalapalli Sundarayya’s nephew commits suicide in Khammam

ఖమ్మం, ఆగస్ట్‌ 29: ప్రముఖ కమ్యూనిస్టు నేత పుచ్చలపల్లి సుందరయ్య తెలియని తెలుగు వారుండరు. ఆయన 40వ వర్ధంతి వేడుకలు ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరిగాయి. అయితే తాజాగా పుచ్చలపల్లి సుందరయ్య మేనల్లుడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర కలకరం లేపింది. నెల్లూరుకు చెందిన దువ్వూరు చంద్రశేఖర్‌రెడ్డి (77) పుచ్చలపల్లి సుందరయ్యకు స్వయానా మేనల్లుడు. వృద్ధాప్యంలో ఉన్న చంద్రశేఖర్‌ రెడ్డి భార్య కొన్నేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో ఆయన అమెరికాలో ఉన్న ఇద్దరు కుమార్తెల వద్ద కొంతకాలం గడిచి.. ఇటీవల హైదరాబాద్‌ వచ్చి వృద్ధాశ్రమంలో ఉంటున్నారు.

ఏం జరిగిందో తెలియదుగానీ జీవితంపై విరక్తి చెందినట్లు ఆయన ప్రవర్తించసాగారు. కొన్నిరోజుల క్రితం కాశీ యాత్రకు కూడా వెళ్లారు. బుధవారం (ఆగస్ట్‌ 27) తిరిగి వచ్చే క్రమంలో ఖమ్మంలో రైలు దిగారు. అనంతరం స్టేషన్‌కు కొద్ది దూరాన ఉన్న మామిళ్లగూడెం ప్రాంతంలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. సంఘటన స్థలంలో లభ్యమైన సెల్‌ఫోన్, ఆధార్‌ కార్డ్‌లోని వివరాల ఆధారంగా అధికారులు మృతుడిని దువ్వూరు చంద్రశేఖర్‌రెడ్డిగా గుర్తించారు.

అనంతరం ఆయన బంధువులకు సమాచారం అందించారు. అన్నం ఫౌండేషన్‌ చైర్మన్‌ శ్రీనివాసరావు సహకారంతో ఖమ్మంలోనే ఆయన భౌతికకాయాన్ని మార్చురీకి తరలించారు. అనంతరం చంద్రశేఖర్‌రెడ్డి బంధువులు అక్కడికి చేరుకుని అంత్యక్రియల కోసం భౌతికకాయాన్ని తీసుకెళ్లారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Leave a Comment