
దిశ, వెబ్‌డెస్క్: ఛత్తీస్‌గఢ్ పరిసర ప్రాంతాల్లో ఉన్న అల్పపీడనంకు అనుబంధంగా ఉపరితల ఆవర్తనం, రుతుపవన ద్రోణి కొనసాగుతున్నట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో ఏపీలో మరో వారంరోజులపాటు వర్షాలు కురుస్తాయని తెలిపింది. రాష్ట్రంలో ఆరు జిల్లాలకు భారీ వర్షసూచన చేసింది. అల్లూరి సీతారామరాజు, ఏలూరు, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. ఈ క్రమంలో అధికారులు 6 ప్రధాన పోర్టుల్లో మూడవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.
మరోవైపు తెలంగాణలోనూ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఉత్తర తెలంగాణ జిల్లాలకు వాతావరణశాఖ భారీ వర్షసూచన చేసింది. ఆదిలాబాద్, కొమురంభీం, మంచిర్యాల, భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, రాష్ట్రంలో 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే ఛాన్స్ ఉందని తెలిపింది. అల్పపీడనం, భారీ వర్షాల నేపథ్యంలో మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని సూచించింది.