అలోపతిని మిక్సోపతి చేయొద్దు: కేంద్రానికి IMA వార్నింగ్

అలోపతిని మిక్సోపతి చేయొద్దు:  కేంద్రానికి  IMA వార్నింగ్

దిశ తెలంగాణ బ్యూరో: కేంద్రం తీసుకోవాలనుకుంటున్న ఓ నిర్ణయం పట్ల దేశంలోని అతి పెద్ద డాక్టర్స్ గ్రూప్ అయిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఎ) ఆగ్రహానికి కారణం అవుతోంది. ప్రముఖ వైద్య సంస్థ అయిన జవహర్ లాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్( జిప్మర్)లో ఎంబిబిఎస్‌తో పాటు ఆయుర్వేదంలో బ్యాచిలర్ డిగ్రీ అయిన బి.ఏ.ఎం.ఎస్ ని మిక్స్ చేస్తూ కోర్సు ప్రవేశ పెట్టే ప్రయత్నం పట్ల దేశవ్యాప్తంగా వైద్యుల నుండి నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలంటూ.. లేదంటే పోరాటం తప్పదంటూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ గట్టిగానే కేంద్రానికి వార్నింగ్ ఇచ్చింది. దీంతో నేషనల్ మెడికల్ కమిషన్ దీనిపై స్పందించాల్సి వచ్చింది.

అసలేంటి ఈ నిర్ణయం..

కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి అయిన ప్రతాప్ రావు జాదవ్ మే 27వ తారీఖున ఒక ప్రకటన చేస్తూ జిప్మర్లో ఎంబిబిఎస్ ‌బిఏఎంఎస్ కంబైన్డ్ డిగ్రీని ప్రవేశపెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. దీనికోసం కేంద్రం ఆర్థిక సహాయంతో పాటు ఇతర చర్యలు కూడా తీసుకోనుందని తెలిపారు. ఈ ప్రకటన వైద్య ప్రముఖులను ఆశ్చర్యానికి గురి చేసింది. నిజంగానే కేంద్రం ఇలాంటి స్టెప్పు వేయబోతుందనే అనుమానం వారిలో వ్యక్తం అయింది.

ఐఎంఏ స్ట్రాంగ్ వార్నింగ్..

అయితే దీనిపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తీవ్రంగానే స్పందించింది. తాము వైద్యరంగంలోని ఏ కోర్సుకు వ్యతిరేకం కాదని.. కానీ రెండు విభిన్న మార్గాలలో వెళ్లే వైద్య రంగాలను కలపడం ద్వారా వచ్చే ఫలితాలు కూడా అదే విధంగా ఉంటాయని.. అత్యవసర సమయంలో చికిత్స అందించే విషయంలో సైతం పలు ఇబ్బందులు ఎదురవుతాయని స్పష్టం చేసింది. ఈ మిక్సోపతి కారణంగా అలోపతిలో గాని అటు ఆయుర్వేదంలో పూర్తిస్థాయి పట్టుసాధించలేక చివరికి సబ్జెక్టు లేని డాక్టర్లు తయారవుతారని.. ఇది వైద్యరంగంపై తీవ్ర ప్రభావం చూపుతుందని హెచ్చరిస్తోంది.పైగా పేషెంట్ సైతం తన చికిత్సకి సంబంధించి అయోమయానికి గురయ్యే అవకాశం ఉందని పేర్కొంది. దీనిపై కనుక కేంద్రం వెనకడుగు వేయనట్లయితే తప్పకుండా తాము దశలవారీగా ఉద్యమాన్ని కొనసాగిస్తామని తెలిపింది. అంతేకాకుండా ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పోస్టుల ద్వారా ప్రచారం సైతం నిర్వహిస్తోంది.

మెడికల్ కమిషన్ ఏమంటోంది..

ఈ నిర్ణయాన్ని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న తరుణంలో నేషనల్ మెడికల్ కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ అభిజాత్ షేత్ ఐఎంఏ అధ్యక్షుడు డా.మెహుల్ జే షాకి వివరణ ఇస్తూ లేఖ రాశారు.ఇందులో దీనిపై వివరణ ఇస్తూ పిజిఎంఈఆర్ 2023లోని సవరణ ప్రకారం పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ సమర్పించే రీసెర్చ్ పేపర్లను జాతీయ స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ జరిగే ఐఎంఏ సమావేశాల్లో పూర్తిస్థాయిలో ఆమోదించబడతాయని.. దీనికోసం ఏ విద్యార్థి పై కూడా ప్రత్యేకించి ఒక వైద్య రంగానికి చెందిన అంశంపై ఎంపిక చేసుకోవాలని ఒత్తిడి ఉండదని పేర్కొన్నారు. దీంతో ఈ నిర్ణయం అమలుపట్ల నేషనల్ మెడికల్ కమిషన్ సైతం వెనకడుగు వేస్తుందన్న సూచనలు కనిపిస్తున్నాయి.. కానీ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మాత్రం ఇప్పటికీ పూర్తిస్థాయి క్లారిటీ రావాల్సిందని భావిస్తోంది.

Leave a Comment