తన చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విషయంలో ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల సంచలన ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి జగన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రధాని మోదీకి జగన్ దత్తపుత్రుడని, అందుకే జగన్ను, ఆయన సోదరుడు అవినాశ్ రెడ్డిని కాపాడటం కోసం మోదీ సీబీఐ గొంతు నొక్కుతున్నారని ఆరోపించారు.వివేకా హత్య కేసు దర్యాప్తును ప్రస్తావిస్తూ, ఈ కేసులో మళ్లీ విచారణ ఎందుకు చేపట్టరని ప్రభుత్వాన్ని షర్మిల సూటిగా ప్రశ్నించారు. వై నాట్? అంటూ నిలదీశారు. ఇన్నేళ్లుగా న్యాయం కోసం పోరాటం చేస్తున్నా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. వివేకా కుమార్తె సునీత చేస్తున్న పోరాటంలో పూర్తి న్యాయం ఉందని, ఆమెకు తన మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ పనితీరుపై షర్మిల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఁసీబీఐ అనేది మోదీ చేతిలో ఒక కీలుబొమ్మగా మారిపోయింది. నిజంగా సీబీఐ చిత్తశుద్ధితో పనిచేసి ఉంటే ఈపాటికే దోషులకు శిక్ష పడేది అని అన్నారు. హత్య జరిగినప్పుడు సంఘటనా స్థలంలో అవినాశ్ రెడ్డి ఉన్నారని చెప్పడానికి గూగుల్ మ్యాప్ లొకేషన్లతో సహా బలమైన ఆధారాలు ఉన్నాయని గుర్తుచేశారు. ఇన్ని సాక్ష్యాధారాలు ఉన్నప్పటికీ, అవినాశ్ రెడ్డిని కాపాడటానికే దర్యాప్తును నీరుగారుస్తున్నారని ఆమె ఆరోపించారు. సీబీఐ దర్యాప్తు సరిగ్గా జరగడం లేదని సునీత చేస్తున్న ఆరోపణల్లో నిజం ఉందని షర్మిల పేర్కొన్నారు.
