Site icon Desha Disha

YSRCP Koyye Moshen Raju: కూటమికి భయపడని ఆ నేత!

YSRCP Koyye Moshen Raju: కూటమికి భయపడని ఆ నేత!

YSRCP Koyye Moshen Raju: కూటమికి భయపడని ఆ నేత!

YSRCP Koyye Moshen Raju: ఏపీలో( Andhra Pradesh) కూటమి ప్రభుత్వం దూకుడు మీద ఉంది. దూకుడు నిర్ణయాలు తీసుకుంటుంది. రాజకీయంగా కూడా అత్యంత బలంగా ఉంది. కేంద్ర ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉంది. కూటమి అంటేనే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు భయపడుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఒక నేత మాత్రం టిడిపి కూటమికి లెక్కచేయడం లేదు. డోంట్ కేర్ అంటూ తేల్చి చెబుతున్నారు. కూటమికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవడం లేదు సరి కదా.. ఏకంగా ప్రభుత్వాన్ని ఢీకొట్టేలా వ్యవహరిస్తున్నారు. పోనీ పవర్ ఫుల్ నాయకుడు అనుకుంటే అది కాదు. వైసిపి పట్ల అంత అభిమానం ఎందుకంటే.. జగన్ పిలిచి మరి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడంతో స్వామి భక్తి ప్రదర్శిస్తున్నారు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇంతకీ ఎవరా నేత? అంటే.. మండలి చైర్మన్ కొయ్య మోసేన్ రాజు.

హైకోర్టు నోటీసులు..
తాజాగా శాసనమండలి కార్యదర్శి హైకోర్టు( High Court) నోటీసులు ఇచ్చింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉండి ఎమ్మెల్సీ పదవి పొందిన జయ మంగళం వెంకటరమణ కొద్ది నెలల కిందట జనసేనలో చేరారు. వైసిపి ద్వారా తనకు వచ్చిన ఎమ్మెల్సీ పదవికి సైతం రాజీనామా చేశారు. అయితే ఆ రాజీనామాను మండలి చైర్మన్ మోసేన్ రాజు ఆమోదించడం లేదు. నెలల తరబడి పెండింగ్లో పెట్టారు. దీంతో జయ మంగళం వెంకటరమణ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన న్యాయస్థానం శాసనమండలి కార్యదర్శికి నోటీసులు ఇచ్చింది. దీంతో మండలి చైర్మన్ మోసేన్ రాజు వ్యవహార శైలి మరోసారి చర్చకు వచ్చింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి దారుణ పరాజయం ఎదురయింది. ఆ పార్టీకి చెందిన కీలక నేతలు సైతం బయటకు వెళ్ళిపోయారు. ప్రస్తుతం మద్యం కుంభకోణంలో జగన్ పేరు సైతం వినిపిస్తోంది. ఇటువంటి సమయంలో కూడా మండల చైర్మన్ మోసేన్ రాజు కఠినంగా వ్యవహరిస్తుండడం, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండడం మాత్రం చర్చకు దారితీస్తోంది.

కాంగ్రెస్ ద్వారా ఎంట్రీ..
మండలి చైర్మన్ మోసేన్ రాజు గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ పార్టీ ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు మోసేన్ రాజు. 1987లో భీమవరం పురపాలక సంఘం ఎన్నికల్లో కాంగ్రెస్ కౌన్సిలర్ గా గెలిచారు. వరుసగా నాలుగుసార్లు కౌన్సిలర్ అయ్యారు. 2009లో కొవ్వూరు అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అప్పట్లో పశ్చిమగోదావరి కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. కానీ జగన్ పిలుపుమేరకు 2010లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఉండి శాసనసభ నియోజకవర్గ ఇన్చార్జిగా కూడా వ్యవహరించారు. 2021 జూన్ 14న ఆయన గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. అదే ఏడాది నవంబర్లో మండలి చైర్మన్గా మోసేన్ రాజును నియమించారు జగన్మోహన్ రెడ్డి. ఏకంగా క్యాబినెట్ హోదా కల్పించారు. ఆ కృతజ్ఞతతోనే ఎన్ని రకాల ఒత్తిళ్లు ఎదురైనా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీల రాజీనామాను ఆమోదించడం లేదు. ఆమోదించిన మరుక్షణం ఓ ఆరు ఎమ్మెల్సీ స్థానాలు టిడిపి కూటమి ఖాతాలో పడతాయి.

వైసిపి ఆధిక్యత తగ్గుతుందని
ప్రస్తుతం మండలిలో వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ ఆధిక్యత కొనసాగుతోంది. గత ఎన్నికల ఫలితాలు వచ్చిన సమయానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలం 38 మంది ఎమ్మెల్సీలు. కానీ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత పోతుల సునీత, కర్రీ పద్మశ్రీ, బల్లి కళ్యాణ చక్రవర్తి, మర్రి రాజశేఖర్, జాఖియా ఖానం, జయ మంగళం వెంకటరమణ వంటి వారు రాజీనామా చేశారు. కేవలం కూటమి ఖాతాల్లో ఎమ్మెల్సీ పదవులు పడేందుకే వీరంతా రాజీనామా బాట పట్టారు. అయితే దీనిని గ్రహించిన మండలి చైర్మన్ మోసేన్ రాజు వారి రాజీనామాలను ఆమోదించడం లేదు. అందుకే ఇప్పుడు జయ మంగళం వెంకటరమణ హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు శాసనమండలి కార్యదర్శికి నోటీసులు జారీచేసింది. దీనికైనా మూసేన్ రాజు స్పందిస్తారో? లేదో? చూడాలి.

Exit mobile version