Visakhapatnam Steel Privatization: విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ.. ఆగే పనేనా?

Visakhapatnam Steel Privatization: అభివృద్ధి చెందుతున్న దేశాలలో ప్రభుత్వ రంగ సంస్థలు.. ఆయా కేంద్ర ప్రభుత్వాల చేతుల్లోనే ఉన్నాయి. అమెరికాతో పాటు ఇంగ్లాండ్ వంటి దేశాలు ఇదే ఫార్ములాను అనుసరిస్తున్నాయి. కానీ దురదృష్టవశాత్తు మనదేశంలో మాత్రం అందుకు విరుద్ధ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వ రంగ సంస్థలను సైతం ప్రైవేటుపరం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో భాగమే విశాఖ స్టీల్ ప్లాంట్( Visakha steel plant) ప్రైవేటీకరణ. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించాలని ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయించింది. వైసిపి హయాంలోని కేంద్ర ప్రభుత్వం పరిధిలోని క్యాబినెట్ సబ్ కమిటీ ఈ నిర్ణయానికి వచ్చింది. అప్పట్లో దీనిపై విపక్షాలుగా ఉన్న టిడిపి, జనసేన వ్యతిరేకించాయి. అప్పట్లో రాష్ట్రంలో అధికారపక్షంగా ఉన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సైతం దీనిని వ్యతిరేకించింది. కానీ ఎట్టి పరిస్థితుల్లో ప్లాంటును ప్రైవేటీకరిస్తామని తేల్చి చెప్పింది కేంద్రం. అయితే ఎన్నడు ఈ ప్రైవేటీకరణ నిర్ణయం గురించి మాట్లాడడం లేదు కేంద్రం. కానీ ఏపీలో టిడిపి కూటమి నేతలు మాత్రం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఉండదన్న ప్రకటనలు చేస్తున్నారు.

Also Read: ఓ కూతురు, ఒక చెల్లి, ఒక స్నేహితురాలు.. హీరోలను మించిన శ్రీలీల గొప్పతనం!

* వాస్తవాలు చెప్పని రాజకీయ పార్టీలు
విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో ఏ రాజకీయ పార్టీ కూడా వాస్తవాలు మాట్లాడడం లేదు. ప్రజలకు వాస్తవాలు చెప్పడం లేదు. ప్రైవేటీకరణ అంశం తెరపైకి వచ్చినప్పుడు రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ( YSR Congress party ) అధికారంలో ఉండేది. రాష్ట్ర రాజకీయాల దృష్ట్యా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బిజెపితో స్నేహం కొనసాగించింది. కానీ ఆ స్నేహంతో రాజకీయ లబ్ధి పొందిందే కానీ.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను గట్టిగా వ్యతిరేకించలేదు. దీంతో కేంద్రం సైతం ఈ పరిశ్రమ విషయంలో ఒక నిర్ణయానికి వచ్చేసింది. ఇప్పుడు కేంద్రంలో కీలకమైన భాగస్వామిగా ఉన్న టిడిపి కూటమి ప్రభుత్వం ఉంది. పైగా అప్పట్లో స్టీల్ ప్లాంట్ విషయంలో వ్యతిరేక ప్రకటనలు కూడా చేశారు. అటువంటిది ఇప్పుడు అధికారంలో ఉన్నారు.. కేంద్రంలో కీలక భాగస్వామిగా ఉన్నారు. అయినా సరే నేరుగా కేంద్ర ప్రభుత్వంతో ప్రైవేటీకరణ ఉండదన్న విషయాన్ని చెప్పించలేకపోతున్నారు.

* 32 విభాగాల్లో ప్రైవేటీకరణ..
ఇటీవల 32 విభాగాల్లో ప్రైవేటీకరణ జరిగిపోయింది. దీంతో తప్పకుండా ప్రైవేటీకరణ జరిగి తీరుతుంది అన్న అనుమానాలు క్రమేపి పెరిగిపోతున్నాయి. ఇప్పుడు కూడా వాస్తవాలు చెప్పడం లేదు కూటమి నేతలు. నిన్నటికి నిన్న గాజువాక ఎమ్మెల్యే, టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్( Palla Srinivas ) స్టీల్ ప్లాంట్ విషయంలో అదే ప్రకటనలు చేశారు. ఎట్టి పరిస్థితుల్లో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని చెప్పుకొచ్చారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు చూస్తుంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ ఆగే అంశం కాదని తేలిపోయింది. ఒకటి మాత్రం నిజం. కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ కు పదకొండు వేల కోట్ల రూపాయల సాయం ప్రకటించింది. మరో రూ.6000 కోట్ల అదనపు సాయం కూడా అందించింది. అయితే ఇది విశాఖ స్టీల్ ప్లాంట్ కు ప్యాకేజీ మాత్రమే. అయితే ఈ ప్యాకేజీ వెనుక కూడా కేంద్రం ఆలోచన ఉంది. ఇంత సాయం చేశాక కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి పెంచలేదని.. అందుకే ప్రైవేట్ పరం చేస్తున్నామని చెప్పేందుకే ఈ సాయం అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

* సొంత గనులు లేకపోవడంతో..
దేశంలో సొంత గనులు లేని ఏకైక స్టీల్ ప్లాంట్ ఇది. చిన్నపాటి ప్రైవేట్ స్టీల్ ప్లాంట్లకు సైతం సొంత గనులు ఉన్నాయి. కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ కు సొంత గనులు లేకపోవడం మాత్రం విచారకరం. విశాఖ స్టీల్ ప్లాంట్ అనువైన ప్రాంతంలోనే ఉంది. రవాణా పరంగా మెరుగైన పరిస్థితుల్లోనే ఉంది. అయినా సరే సొంతగనులు లేకపోవడం వల్లే ఉత్పత్తి అందించలేకపోతోంది. తద్వారా ఉత్పత్తి సాకుగా చూపి ప్రైవేటుపరం చేయాలన్నది కేంద్రం ఆలోచన. అదే విశాఖలో ప్రైవేటు స్టీల్ ప్లాంట్లు ఏర్పాటు అవుతున్నాయి. వీటికి సొంత గనులు కేటాయించాలని సీఎం చంద్రబాబు కేంద్రానికి ప్రత్యేకంగా లేఖ రాశారు. కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ జోలికి మాత్రం వెళ్లడం లేదు. తద్వారా విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ జరగకుండా ఆపడం సాధ్యం కాని పని అని తేలిపోయింది. అటువంటిప్పుడు నేతలు భిన్న ప్రకటనలు చేసి జఠిలం చేయకుండా ప్రయత్నించాల్సిన అవసరం ఉంది.

Leave a Comment