Site icon Desha Disha

India-US: ట్రంప్ టారిఫ్‌లకు జీఎస్టీ సంస్కరణలతో పరిష్కారం

India-US: ట్రంప్ టారిఫ్‌లకు జీఎస్టీ సంస్కరణలతో పరిష్కారం
India-US: ట్రంప్ టారిఫ్‌లకు జీఎస్టీ సంస్కరణలతో పరిష్కారం

దిశ, బిజినెస్ బ్యూరో: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ఉత్పత్తులపై విధించిన అధిక 50 శాతం సుంకాలు అమల్లోకి వచ్చాయి. దీని పట్ల ఇప్పటికే అనేక రంగాల నుంచి ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో, ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జీఎస్టీ సంస్కరణలు టారిఫ్ భారాన్ని భర్తీ చేయవచ్చని నిపుణులు భరోసా ఇస్తున్నారు. దీపావళి నుంచి అమల్లోకి రాబోయే జీఎస్టీ సంస్కరణలు కొంత ఉపశమనం కలిగించవచ్చని ఫిచ్ సొల్యూషన్స్ కంపెనీ బీఎంఐ గురువారం ప్రకటనలో వెల్లడించింది. అంతేకాకుండా ఈ దశాబ్దం మొత్తం భారత్ ఆసియాలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థికవ్యవస్థలలో ఒకటిగా ఉండే అవకాశం ఉందని అభిప్రాయపడింది.

వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థికవ్యవస్థలలో భారత్

అమెరికా అధిక టారిఫ్ కొన్ని రంగాలను తీవ్రంగా దెబ్బ తీసినప్పటికీ, భారత జీడీపీ 6 శాతానికి మించి వృద్ధిని నమోదు చేయగలదు. దశాబ్దం చివరి నాటికి కొంత తగ్గి 6 శాతంగా ఉండవచ్చు. 2010-2019 మహమ్మారికి ముందు సగటు 6.5 శాతం కంటే కొంచెం తక్కువే అయినప్పటికీ, ఆసియాలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థికవ్యవస్థలలో ఒకటిగా కొనసాగలదని బీఎంఐ అంచనా వేసింది. ఇక, వచ్చే దశాబ్దంలో ఉత్పాదకత దాదాపు 5 శాతం పెరుగుతుందని, తద్వారా వృద్ధికి గణనీయమైన మద్దతు ఇస్తుందని అభిప్రాయపడింది. తాజా జీఎస్టీ సంస్కరణలు వృద్ధికి అడ్డంకిగా ఉన్న సమస్యలను పరిష్కరించగలవు. ఇప్పటివరకు ఉన్న అంచనాలే వృద్ధికి ఊతమిస్తున్నప్పుడు, దీపావళి తర్వాత మరింత దోహదపడతాయని భావిస్తున్నట్టు బీఎంఐ వివరించింది.

డిమాండ్‌కు ఊతం

వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) నిర్మాణంలో కీలక మార్పులు చేస్తూ కేంద్రం ఇటీవల నాలుగు శ్లాబుల(5%,12%,18%,28%) స్థానంలో 5%, 18% శ్లాబ్‌లను ప్రకటించింది. దీపావళి నుంచి ఇది అమల్లోకి రానుండగా, దీనివల్ల సరసమైన ధరలో ఉన్న కార్ల ధరలూ తగ్గుతాయని, పండుగ సీజన్ కావడంతో డిమాండ్‌కు మరింత మద్దతిస్తుందని నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న జీఎస్టీ విధానంలో వాహనాలకు సంబంధించి ఇంజిన్ సామర్థ్యం, పరిమాణం విషయంలో వర్గీకరణ సమస్యలను కొత్త రేట్ల నిర్ణయం పరిష్కరించే అవకాశం ఉందని బీఎంఐ తెలిపింది.

కొత్త శ్లాబ్ రేట్లు దేశ జీడీపీకి కీలకమైన ఆర్థిక సేవలు, వాహన, సిమెంట్ రంగాలకు లాభదాయకమని ఆర్థిక నిపుణులు అంచనా కడుతున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో ప్రకటించిన ఆదాయ పన్ను తగ్గింపునకు తోడు తాజా జీఎస్టీ సంస్కరణలతో దేశ వినియోగానికి రూ. 5.31 లక్షల కోట్ల మేర ప్రయోజనాలు లభించనున్నాయి. ఇది దేశ జీడీపీలో 1.6 శాతానికి సమానం. ఈ పరిణామాల మధ్య అమెరికా టారిఫ్ ప్రభావం తక్కువగా ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. 

Exit mobile version