Health Tips: గుండెపోటు రావడానికి నెల ముందు కనిపించే లక్షణాలు.. లైట్ తీసుకుంటే అంతే సంగతులు.. – Telugu News | Do you know what symptoms appear month before a heart attack

ఆధునిక కాలంలో మారిన జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల కారణంగా గుండె సంబంధిత వ్యాధులు ఇటీవలి కాలంలో విపరీతంగా పెరిగిపోయాయి. గతంలో వృద్ధులలో ఎక్కువగా కనిపించే గుండెపోట్లు ఇప్పుడు యువకులలో, పిల్లలలో కూడా ఆందోళన కలిగించే విధంగా పెరిగాయి. ఈ తీవ్రమైన సమస్యను ఎదుర్కోవాలంటే, దాని లక్షణాలను ముందుగానే గుర్తించడం చాలా ముఖ్యం. గుండెపోటుకు సుమారు నెల రోజుల ముందు నుంచే మన శరీరంలో కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. వాటిని సకాలంలో గుర్తించి చికిత్స తీసుకుంటే ప్రాణాలను కాపాడుకోవచ్చు. ఆ లక్షణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఛాతీ, భుజం, దవడ నొప్పి

గుండెపోటుకు ముందు కనిపించే ముఖ్యమైన లక్షణాలలో ఇది ఒకటి. మీకు ఛాతీ చుట్టూ ఏదో ఒత్తిడి లేదా బరువుగా అనిపించవచ్చు. కొంతమందికి చేతులు, భుజాలు లేదా దవడలలో నొప్పి కూడా రావచ్చు. ఈ సంకేతాలను అస్సలు విస్మరించకూడదు. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది.

అలసట – బలహీనత

ఎటువంటి కఠినమైన పని చేయకపోయినా మీరు త్వరగా అలసిపోతున్నట్లు, బలహీనంగా ఉన్నట్లు అనిపించవచ్చు. ముఖ్యంగా ఈ లక్షణం పదేపదే కనిపిస్తే ఇది గుండెపోటుకు ముందస్తు సంకేతం కావచ్చు. దీన్ని తేలికగా తీసుకోకుండా వైద్యుడిని సంప్రదించాలి.

తలతిరగడం – మూర్ఛలు

గుండెపోటుకు 30 రోజుల ముందు తరచుగా తలతిరగడం, కొన్నిసార్లు మూర్ఛపోవడం వంటివి సంభవించవచ్చు. ఈ సమయంలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తలనొప్పి, రక్త ప్రసరణ తగ్గడం వంటి లక్షణాలు కూడా ఉంటాయి. ఈ పరిస్థితి తీవ్రమైనది కాబట్టి వెంటనే డాక్టర్ వద్దకు వెళ్ళాలి.

శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు

సాధారణ పనులు చేసిన తర్వాత లేదా శారీరక శ్రమ లేకుండా కూడా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా అనిపిస్తే అది గుండెపోటుకు సంకేతం కావచ్చు. గుండె సరిగ్గా రక్తాన్ని పంప్ చేయనప్పుడు ఈ సమస్య వస్తుంది. ఈ లక్షణాలలో ఏవి కనిపించినా.. వెంటనే వైద్య నిపుణుడిని సంప్రదించి చికిత్స తీసుకోవడం అత్యవసరం. సకాలంలో తీసుకున్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

[

Leave a Comment