
దిశ, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ బరోడా రుణాలపై వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. ఎంపిక చేసిన కార్లు, తనఖా రుణాలపై 0.25 శాతానికి పైగా రేట్ల కోత నిర్ణయాన్ని బ్యాంకు తీసుకుంది. ఇటీవల భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) ఆర్థిక విస్తరణకు సహాయపడే క్రెడిట్ వృద్ధిని పెంచాలని పిలుపునిస్తున్న సమయంలో బ్యాంక్ ఆఫ్ బరోడా(బీఓబీ) వడ్డీ తగ్గించింది. ఇదే సమయంలో దేశవ్యాప్తంగా పండుగ సీజన్ మొదలవడంతో అందుకనునుగుణంగా కస్టమర్లకు తక్కువ వడ్డీకే రుణాలివ్వాలని నిర్ణయించామని బ్యాంకు గురువారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ తగ్గింపుతో ఇతర బ్యాంకులతో పోలిస్తే తమ బ్యాంకు రుణాలు తక్కువ వడ్డీకే లభిస్తాయని బీఓబీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంజయ్ ముదలియార్ అన్నారు. సవరణల తర్వాత బ్యాంకు నుంచి తీసుకున్న కార్ల రుణాలపై వడ్డీ రేట్లు ఇప్పుడు 8.15 శాతం నుంచి ప్రారంభమవుతాయి. ఇది వరకు కార్ల రుణాలపై 8.40 శాతం వడ్డీ ఉండేది. తనఖా రుణాలపైనా వడ్డీ రేట్లు గతంలో 9.85 శాతం ఉండగా, తగ్గించిన తర్వాత 9.15 శాతం నుంచి ప్రారంభమవుతాయని బ్యాంకు వెల్లడించింది.