Site icon Desha Disha

బీహార్‌ లోకి జైషే ఉగ్రవాదుల కలకలం..

బీహార్‌ లోకి జైషే ఉగ్రవాదుల కలకలం..

ఎన్నికల ముందు రాష్ట్రంలో హైఅలర్ట్‌

మరికొన్ని నెలల్లో బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న వేళ రాష్ట్రంలో ఉగ్ర కలకలం రేగింది.
నిఘా వర్గాల సమాచారం ప్రకారం, ఇటీవల ముగ్గురు జైషే మహ్మద్‌ ఉగ్రవాదులు బిహార్‌లో ప్రవేశించినట్లు గుర్తించారు.ఈ నేపథ్యంలో బీహార్ పోలీసు హెడ్‌క్వార్టర్స్ గురువారం రాష్ట్రవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించి, ఉగ్రవాదుల ఫొటోలు, ఇతర వివరాలను పబ్లిక్‌కు విడుదల చేసింది. సీనియర్‌ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, వీరు నేపాల్‌ ద్వారా బీహార్‌కి చేరుకున్నారని చెప్పారు.

అనుమానాస్పద వ్యక్తులు కన్పిస్తే వెంటనే సమాచారాన్ని అందించండి
ఉగ్రవాదులను హస్నైన్‌ అలీ (రావల్పిండి), ఆదిల్‌ హుస్సేన్‌ (ఉమర్‌కోట్‌), మహ్మద్‌ ఉస్మాన్‌ (బహవల్‌పూర్‌)గా గుర్తించారు. వీరంతా పాకిస్థాన్‌ కేంద్రంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్న జైషే మహ్మద్‌ ముఠా సభ్యులని బిహార్‌ పోలీసులు వెల్లడించారు. నిఘా వర్గాల సమాచారం ప్రకారం, వీరు ఆగస్టు రెండవ వారంలో కాఠ్మాండూ చేరి, గతవారం బీహార్‌లోకి చొరబడ్డారని గుర్తించారు. ఇప్పటికే వీరి ఫొటోలు, ఇతర వ్యక్తిగత వివరాలను సరిహద్దు జిల్లాల పోలీసులు అందుకున్నారు. ఈ ప్రాంతాల్లో నిఘా మరింత పెంచాలని, అనుమానాస్పద వ్యక్తులు కన్పిస్తే వెంటనే సమాచారాన్ని అధికారులకి అందించమని సూచించారు.

బీహార్‌ వ్యాప్తంగా భద్రత కట్టుదిట్టం
ఈ ఏడాది చివర్లో బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న సమయంలో ఈ పరిణామం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అదే సమయంలో,కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ కూడా ఈ రాష్ట్రంలో పర్యటన చేస్తున్నాడు. భద్రతను కట్టుదిట్టం చేయడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంది. నేపాల్‌తో సరిహద్దు ఉన్న జిల్లాలు, సీమాంచల్‌ ప్రాంతంలో భద్రతను పెంచి, రైల్వే స్టేషన్లు, బస్‌ స్టేషన్లు, పెద్ద రద్దీ ప్రాంతాల్లో కఠిన తనిఖీలను నిర్వహిస్తున్నారు. చెక్‌పోస్ట్‌ల వద్ద పేట్రోలింగ్‌ను మరింతగా పెంచారు.

అక్రమ చొరబాట్లకు హాట్‌స్పాట్‌
ముందస్తుగా, ఈ ఏడాది మే నెలలోనూ బీహార్‌లో అనుమానాస్పద వ్యక్తుల కదలికలను నిఘా వర్గాలు గమనించాయి.కేవలం 20 రోజులలోనే 18 మంది కొత్తవారు రాష్ట్రానికి ప్రవేశించినట్లు గుర్తించడంతో, పోలీసులు గాలింపు చేపట్టారు.కొందరిని అరెస్టు చేసిన ఘటనలో, నిందితుల్లో ఒకరు ఖలిస్తానీ అనుచరుడిగా గుర్తించారు.బీహార్ రాష్ట్రం 729 కిలోమీటర్ల మేర నేపాల్‌తో సరిహద్దు పంచుకుంటుంది.
ఈ కారణంగా, అక్రమ చొరబడే కార్యకలాపాలకు ఇది హాట్‌స్పాట్‌గా మారింది.

Exit mobile version