వాయవ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం
రాయలసీమ జిల్లాలకు ఎల్లో అలర్ట్ హెచ్చరిక
ఉత్తర కోస్తాలో భారీ వర్షాలకు అవకాశం
వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో కోస్తాంధ్రకు ఆరెంజ్ అలర్ట్, రాయలసీమ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ప్రజలు, ముఖ్యంగా మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ప్రస్తుతం ఒడిశా తీరానికి సమీపంలోని వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోందని, దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కూడా ఏర్పడిందని అధికారులు వివరించారు. ఈ అల్పపీడనం పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ క్రమంగా బలహీనపడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అయినప్పటికీ దీని ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు పడతాయని స్పష్టం చేశారు.
వాతావరణ శాఖ సూచనల ప్రకారం.. ఉత్తర కోస్తాంధ్రలో చాలా చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాలో కూడా ఒకటి రెండు ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదయ్యే సూచనలు ఉన్నాయి. వర్షాలతో పాటు తీరం వెంబడి గంటకు 35 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు.