Site icon Desha Disha

ఉపకార వేతనాల కోసం సంక్షేమ భవన్‌ను ముట్టడించిన తెలంగాణ బీసీ విద్యార్ధి సంఘం

ఉపకార వేతనాల కోసం సంక్షేమ భవన్‌ను ముట్టడించిన తెలంగాణ బీసీ విద్యార్ధి సంఘం
ఉపకార వేతనాల కోసం సంక్షేమ భవన్‌ను ముట్టడించిన తెలంగాణ బీసీ విద్యార్ధి సంఘం

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో 14 లక్షల మంది కాలేజీ విద్యార్థుల ఫీజుల బకాయిలు రూ.6 వేల కోట్లు వెంటనే చెల్లించాలని, 100 బీసీ కాలేజీ హాస్టలు, 119 బీసీ గురుకులాలు మంజూరు చేయాలనీ తెలంగాణ బీసీ విద్యార్ధి సంఘం డిమాండ్ చేసింది. గురువారం హైదరాబాద్ లోని మాసాబ్ ట్యాంక్ వద్ద తెలుగు సంక్షేమ భవన్ ను ముట్టడించారు. పెద్ద ఎత్తున విద్యార్థులు తరలిరావడంతో పోలీసు బందోబస్తు భారీగా ఏర్పాటు చేశారు. అనంతంర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య మాట్లాడారు. విద్యార్థుల స్కాలర్షిప్, ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలన్నారు.

ప్రభుత్వం విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం చేయడం తగదన్నారు. ఫీజు రియంబర్స్ మెంట్, ఉపకార వేతనాలతోనే చిన్న, సన్నకారు, వ్యవసాయ, వ్యవసాయేతర కూలీల పిల్లలు, మెడిసిన్, ఇంజనీరింగ్, పీజీ, డిగ్రీలు చదువుతున్నారని గుర్తు చేశారు. ఈ ఫీజు బకాయిలు చెల్లించక పోవడంతో విద్యార్థులు అష్ట కష్టాల పాలవుతున్నారు. ఈ ఫీజులు కట్టాలని విద్యార్థులపై ఆయా కళాశాలల యాజమాన్యాలు ఒత్తిడి తెస్తున్నాయని, కోర్సు పూర్తయిన వారికి సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని, సర్టిఫికెట్లు లేక ఉద్యోగాలు రావడం లేదన్నారు. విద్యా రాజ్యాంగ బద్ధమైన హక్కు. SC/ST/BC లకు అభివృద్ధికి ఉపయోగపడే స్కీములను ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నీరుగారుస్తుందని విమర్శించారు.

అనేక స్కీములకు లక్షల కోట్ల అప్పు తెస్తున్న ప్రభుత్వం లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే ఈ పథకానికి రూ.6 వేల కోట్లు అప్పు తెస్తే ఎవరు అడ్డుకుంటారని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఈ 20 నెలల కాలంలో రూ.20 కూడా విడుదల చేయలేదని అన్నారు. ఈ పథకం అమలుకు ఏటా నాలుగు శాఖల ద్వారా బడ్జెట్లో రూ.5 వేల కోట్లు కేటాయించి కూడా ఒక్క రూపాయి విడుదల చేయకుండా ల్యాప్స్ చేశారన్నారు. కేంద్ర ప్రభుత్వం SC/ST.లకు ఈ పథకం కింద వేల కోట్లు కేటాయిస్తుంది. ఆ నిధులను ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు దఫాలుగా రూ.1500 కోట్లు విడుదల చేశారు.

కానీ మన రాష్ట్రంలో ఫీజులు, స్కాలర్షిప్లు, విడుదల చేయకుండా విద్యార్థుల భవిష్యత్తు తో చెలగాటం ఆడుతున్నారని విమర్శించారు. ఒకవైపు ఫీజు బకాయిలు చెల్లించకుండా, ఇంకొక వైపు ఫీజుల స్కీములు ఎత్తివేయడానికి ట్రస్ట్ బ్యాంక్ ఏర్పాటు చేసి దాని ద్వారా ఫీజులు చెల్లిస్తామని కొత్త నాటకానికి తెర లేపారని, ఈ ప్రతిపాదన ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని, దీనిని గట్టిగా వ్యతిరేకిస్తామని స్పష్టం చేశారు. ఈ ముట్టడిలో కార్యక్రమంలో వేముల రామకృష్ణ, గుజ్జ కృష్ణ, సుధాకర్, నంద గోపాల్, యస్.రవి కుమార్ యాదవ్, చంద్ర శేఖర్, నిఖిల్, అరవింద్, రాఘవేంద్ర తదితర విద్యార్థులు పాల్గొన్నారు.

Exit mobile version