Site icon Desha Disha

Telangana HeavyRains : కామారెడ్డి, మెదక్ పై మేఘ గర్జన.. అల్లకల్లోలం

Telangana HeavyRains : కామారెడ్డి, మెదక్ పై మేఘ గర్జన.. అల్లకల్లోలం

Telangana HeavyRains : సెంట్రల్ తెలంగాణలో కీలక పట్టణాలైన మెదక్, కామరెడ్డి పై మేఘాలు గర్జించాయి. మేఘ విస్ఫోటనం వల్ల ఈ రెండు పట్టణాలలో 30 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదయింది. ఫలితంగా ఈ పట్టణాల పరిధిలో గ్రామాలన్నీ జలమయమయ్యాయి. కామారెడ్డి పట్టణ పరిధిలోని బొగ్గుగుడిశా గ్రామం నోట మునిగింది. ఈ గ్రామంలో 9 మంది వాగులో చిక్కుకుపోవడంతో.. రెస్క్యూ బృందాలు వెంటనే స్పందించాయి. వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. సుమారు గంటపాటు జరిగిన ఈ ఆపరేషన్లో దాదాపు 20 మంది సిబ్బంది పాల్గొన్నారు. ఆ తర్వాత ఆ 9 మందిని అత్యంత సురక్షితంగా బయటికి తీసుకొచ్చారు. జల ప్రవాహం అంతకంతకు పెరుగుతున్న నేపథ్యంలో వాగులో చిక్కుకుపోయిన తొమ్మిది మంది ఆర్తనాదాలు చేశారు.

రికార్డు స్థాయిలో వర్షం..

మేఘ విస్ఫోటనం వల్ల కామారెడ్డి, మెదక్లో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదయింది. మెదక్లోని చుట్టుపక్కల గ్రామాలు మొత్తం జలమయమయ్యాయి. కామారెడ్డిలో రైల్వే ట్రాక్ కింది నుంచి వరద నీరు ప్రవహించడంతో.. ట్రాక్ గాలిలో వేలాడుతోంది. దీంతో నిజామాబాద్, కామారెడ్డి మధ్య రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. పలు రైళ్ల రాకపోకలను దక్షిణ మధ్య రైల్వే నిలిపివేసింది. వేరే మార్గం మీదుగా రైళ్లను నడుపుతోంది.. కామారెడ్డిలో కనివిని ఎరుగని స్థాయిలో వర్షాలు కురవడంతో జనజీవనం పూర్తిగా స్తంభించింది.. పంటచేలన్నీ ఇసుక మేటలు వేశాయి. చేతికొచ్చిన పత్తి నాశనమైంది. పసుపు తోటలు నేలమట్టమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగిపోయాయి. విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. రోడ్లన్నీ కొట్టుకుపోయాయి.

చెరువు కట్టలకు గండ్లు

విపరీతమైన వర్షం వల్ల కామారెడ్డి, మెదక్ పట్టణాలలో చెరువులు అలుగులు పోస్తున్నాయి. పలు ప్రాంతాలలో చెరువు కట్టలకు గండ్లు పడ్డాయి. దీంతో చెరువులో నీరు మొత్తం పంట పొలాలను ముంచింది. ఇసుక మేటలు వేయడంతో పంట పొలాలు దేనికీ పనికిరాకుండా పోయాయి. అయితే ఈ స్థాయిలో ఈ పట్టణాలలో వర్షపాతం నమోదు కావడం ఇటీవల కాలంలో ఇదే తొలిసారి అని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. కామారెడ్డి, మెదక్ లో నీట మునిగిన ప్రాంతాలలో కలెక్టర్, ఎస్పీలు పర్యటిస్తున్నారు. సహాయక చర్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. కేంద్ర రెస్క్యూ బృందాలతో సమన్వయం చేసుకుంటూ నీటమునిగిన ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేరవేర్చుతున్నారు. ఇప్పటివరకు ప్రాణ నష్టం చోటు చేసుకోకపోయినప్పటికీ.. ఆస్తి నష్టం మాత్రం భారీగా జరిగిందని అధికారులు చెబుతున్నారు. ఈ నష్టం వందల కోట్లల్లో ఉంటుందని వారు వివరిస్తున్నారు.

Exit mobile version